హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖ హైదరాబాద్ యూనిట్ పరిధిలో బదిలీల డ్రామా మాటున యథేచ్ఛగా అవినీతి కార్యకలాపాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో అవినీతికి సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందనగా ఉన్నతాధికారులు ఒక్కసారిగా తమ కిందిస్థాయి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఏకంగా యూనిట్ పరిధిలోని 55 మందిపై బదిలీ వేటు వేశారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే.. అవినీతి ఆరోపణలపై కనీసం అంతర్గతంగా శాఖాపరమైన విచారణ నిర్వహించలేదు, బాధ్యులెవరో తేల్చలేదు.. అయినా మూకుమ్మడిగా 55 మందిని ఓడీ (ఆఫీసర్ ఆన్‌డ్యూటీ)లపై పంపించి, వారి స్థానం లో ఇతరులను నియమించారు. కానీ అవినీతి ఆరోపణలకు అసలు సూత్రధారులైన కొందరు అక్కడే తిష్ట వేయగా, సంబంధమేలేని వాళ్లు ఇక్కడ బలి అయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులపై చర్యలంటూ ఉన్నతాధికారులే ఇక్కడ అవినీతికి పాల్పడ్డారని జలసౌధవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్‌శాఖ అమాత్యుడికి వాస్తవాలు వివరించకుండా కొందరు ఉన్నతాధికారులు ఏమార్చి ఈ చర్యలకు దిగారని నిప్పులు చెరుగుతున్నారు.
గతంలో పనిచేసినవారికే మళ్లీ..!
ఇరిగేషన్‌శాఖ హైదరాబాద్ యూనిట్లో మూడు డివిజన్లు ఉండగా, ఒక్కో డివిజన్ పరిధిలో రెండు చొప్పున సబ్డివిజన్లు ఉన్నాయి. ఈ యూనిట్లో ప్రధాన ప్రాజెక్టులేవి లేవు. నాలాలు, చెరువులు, కుంటలు తదితర నీటివనరులు ఉన్న ప్రాంతాల్లో లే అవుట్లకు సంబంధించి అనుమతులు తీసుకోవాలంటే ఇరిగేషన్‌శాఖ ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాలి. హైదరాబాద్ యూనిట్లో ప్రాజెక్టుల నిర్వహణ కంటే ప్రధానంగా ఎన్వోసీల జారీ ప్రక్రియనే ఎక్కువ ఉంటుందని శాఖ అధికారులు చెప్తున్నారు. నగరంలో భూమి విలువ కో ట్లకు చేరడం, అదే అదునుగా ఎన్వోసీల జారీకి పలువురు ఇంజినీర్లు అత్యధిక మొత్తంలో డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. అవినీతి ఆరోపణలతో గతంలోనే యూనిట్ సీఈని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎందుకు? ఏమిటి? అనేది ఇప్పటివరకు బయటకు చెప్పలేదు. ఇక తాజాగా ఇటీవల ఎన్వోసీల జారీలో అవినీతి జరుగుతున్నదని పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ యూనిట్ పరిధిలో మొత్తంగా 55 మందిని ఓడీపై బదిలీ చేయగా, అందులో నలుగురు ఇప్పటికీ అక్కడే కొనసాగడం గమనార్హం. బదిలీ అయినవారి స్థానంలో ఇతర డివిజన్ల నుంచి ఓడీపై హైదరాబాద్ యూనిట్లో నియమించారు. అలా వచ్చినవారిలో చాలామంది గతంలో హైదరాబాద్ యూనిట్లోనే విధులను నిర్వర్తించి, ఇటీవలి కాలంలోనే ఇతర చోట్లకు బదిలీపై వెళారు. మళ్లీ వారినే ఓడీపై తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు.
ఒక్కో పోస్టుకు రూ.5లక్షలు..!
జీవో 87 ప్రకారం ఏకపక్షంగా ఒకేసారి అంతమందిని ఓడీలపై ఇతర యూనిట్లకు పంపడం నిబంధనలకు విరుద్ధం. అలా ఓడీలు ఇచ్చిన సందర్భంలో ఆర్థికశాఖ కొర్రీలు పెట్టి వేతనాలను నిలిపివేసిన ఉదంతాలు జలసౌధలో ఇటీవలనే చోటుచేసుకున్నాయి. ఇటీవల ఈఈల ప్రమోషన్ల విషయం లో పలువురు ఇంజినీర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసి, హైకోర్టును ఆశ్రయించారు. ప్రమోషన్లు పొం దిన ఈఈలను బదిలీ చే యవద్దని, ఎక్కడివారిని అక్కడే కొనసాగించాలని హై కోర్టు సైతం స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు ప్రక్షాళన పేరిట బదిలీలకు పూనుకున్నారు. అందులోనూ ప్రధానంగా అవినీతికి సూత్రధారులైన పలువురు ఇంజినీర్లను ఇప్పటికీ ఆ డివిజన్లో కొనసాగిస్తూ.. సంబంధమేలేని ఇతర ఇంజినీర్లను బదిలీలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్క ఎన్వోసీ కూడా ఇవ్వని ఇంజినీర్లను, అనారో గ్య కారణాలు, వ్యక్తిగత అవసరాల రీత్యా ఇటీవల ఓడీపై ఇతర యూనిట్లు, సర్కిళ్ల నుంచి రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ యూనిట్‌కు వచ్చిన వారిపై సైతం ఏకపక్షంగా బదిలీ వేటు వేశారు. ఉన్నతాధికారులు ఇంత హడావుడిగా బదిలీల ప్రక్రియను చేపట్టడంలో అసలు ఆంతర్యం వసూళ్లకు తెరతీయడమేనని తెలుస్తున్నది.
వాస్తవాలు దాచి.. అమాత్యుడిని ఏమార్చి..
బదిలీలకు సంబంధించి సెక్రటేరియట్ స్థాయిలో కీలకస్థానంలో ఉన్న పలువురు ఉన్నతాధికారుల తీరుపైనే జలసౌధవర్గాలు బాహాటంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. శాఖకు సంబంధించి అమాత్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సైతం వాస్తవాలను తెలపకుండా, గుట్టుచప్పుడు కాకుండా ప్రక్షాళన పేరిట ఏమార్చి అక్రమాలకు తెగబడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. బదిలీలే కాకుండా శాఖకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని, మంత్రిని పక్కదారి పట్టిస్తున్నారని వివరిస్తున్నారు. అమాత్యుడు సైతం సదరు ఉన్నతాధికారులు చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, శాఖలో ఇతర సీనియర్ ఇంజినీర్లను ఎవరినీ సంప్రదించకపోవడంతో సదరు ఉన్నతాధికారులకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఉన్నవారిని, అవినీతి ఆరోపణలున్న ఎదుర్కొంటున్నవారిని బదిలీ చేయకుండా, ఎలాంటి సంబంధం లేనివారిని బలిచేయడమేంటని నిలదీస్తున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటే ప్రభుత్వ నిర్ణయమేనని, చేసేదేమీ లేదని తెగేసి చెప్తున్నారని బాధిత ఇంజినీర్లు వాపోతున్నారు.