Strike | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. అత్యవసర సేవల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించాయి. ఈ నెల 25 నుంచి సమ్మెకు వెళ్లాలని రెండు సంఘాలు నిర్ణయించడంతో.. దీనిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటలు చేతికొచ్చే సమయంలో సమ్మెకు దిగడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించడానికి కృషి చేయాల్సిన విద్యుత్తు సంస్థల ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్లు సమ్మెకు దిగితే.. ఎస్మా చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులకు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఆర్టిజన్లను సమ్మె విరమించాలని కోరారు. పే రివిజన్ విషయంలో ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్యాల మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందంపై కార్మికశాఖ ఉన్నతాధికారులు సమక్షంలో సంతకాలు చేశారని గుర్తు చేశారు.
ఈ ఒప్పందాలను కాదని సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని కార్మికశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందంలోనూ పొందుపర్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరు సమ్మెకు దిగినా, సమ్మెను ప్రోత్సహించినా తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులను ప్రభాకార్‌రావు ఆదేశించారు. దీనిపై ప్రతిరోజూ నివేదికలు పంపాలని కోరారు. యాజమాన్యం ఆదేశాలను ఎవరు ధిక్కరించినా ‘తెలంగాణ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971’ ప్రకారం చర్యలు తీసుకుంటామని టీఎస్ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీలు కూడా ఉత్తర్వులు జారీచేశారు. సమ్మెలో పాల్గొంటే అదే రోజు ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని హెచ్చరించారు. చీఫ్ ఇంజినీర్లు, జోన్లలోని అన్ని ఫంక్షనల్ హెడ్లు సమ్మెకు వెళ్లే ఆర్టిజన్ల వివరాలు పంపాలని ఆదేశించారు. సమ్మెలో పాల్గొంటే 2019 ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్, రెగ్యులేషన్స్ స్టాండింగ్ ఆర్డర్ నం.37(ii) ప్రకారం ఉద్యోగం నుంచి తొలిగిస్తామని స్పష్టంచేశారు. ప్రస్తుతం తీసుకొన్న ఆర్డర్లు 25.02.2023 నుంచి ఆరు నెలల పాటు అమలులో ఉంటాయని తెలిపారు.