హైదరాబాద్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : క్రిస్మస్, సంక్రాంతి వరుస పండుగల నేపథ్యంలో ముఖ్య పట్టణాల నుంచి సొంతూర్లకు బయల్దేరే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కొందరు ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నా, జనరల్ బోగీల్లో ప్రయాణించే వారు కనీసం నిల్చోలేక నరకయాతన పడాల్సి వస్తున్నది. సెలవుల సమయంలో రద్దీ ఎక్కువ ఉంటుందని తెలిసినా అదనపు రైళ్లు, అదనపు బోగీలను అధికారులు ఏర్పాటుచేయడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, నాగపూర్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని ప్రీమియం రైళ్లన్నీ రిజర్వేషన్లకే ప్రాధాన్యం ఇస్తుండగా, వాటిలో అదనపు బోగీలు వేయకుండా, కేవలం రైలుకు చివర ఒకటీరెండింటితోనే సరిపెడుతున్నారు.
వరుస సెలవుల నేపథ్యంలో అదనపు ఆదాయమే లక్ష్యంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారే తప్ప తమకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ రోజుకో ప్రకటన విడుదల చేస్తున్నా, అవి కూడా అరకొరగానే ఉన్నాయని తెలుస్తున్నది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మరికొద్ది రోజుల్లో వచ్చే సంక్రాంతి పండుగకు హైదరాబాద్, సికింద్రాబాద్ సహా ముఖ్య పట్టణాల నుంచి ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నందున, ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.