ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణను రేవంత్ సర్కారు గాలికొదిలేసింది. నిరుడు ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల విద్యాబోధనకు డీఎస్సీ-2024లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్లో సుమారు 900పైగా పోస్టులను ప్రకటించారు. వాటికి పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేసి నియామక పత్రాలు కూడా అందించారు. అప్పటినుంచి వారు తమకు కేటాయించిన పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వారికి శిక్షణ జరుగుతున్న సమయంలోనే శిక్షణను నిలిపిపేస్తున్నట్టు ఆయా జిల్లాల డీఈవోలకు విద్యాశాఖ నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. తదనుగుణంగా డీఈవోలు శిక్షణను వాయిదా వేశారు. ఇది జరిగి నెలరోజులు కావస్తున్నా.. నేటీకీ ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణ షెడ్యూల్ ప్రకటించలేదు.
డీఎస్సీ ఉపాధ్యాయులు, ప్రమోటెడ్ ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ పూర్తిచేయకపోవడం, జాబ్చార్టు రూపొందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివ్యాంగ విద్యపై శీతకన్ను వేసిందన్న సందేహాలు స్పష్టమవుతున్నాయి. ఆర్పీడబ్ల్యూడీ-2016 చట్టం ప్రకారం ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణ, జాబ్చార్టును తక్షణం అమలు చేయాల్సి ఉంటుందని పలు ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదని మండిపడుతున్నాయి.