హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ ) : గురుకులాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఎస్సీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గురుకులంలో విద్యార్థుల ఆత్మహత్యలను కట్టడి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఆ ముందస్తు చర్యల్లో భాగంగా గురుకుల విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పరివర్తనపై గురుకులాల్లో టీచర్లకు శిక్షణకు సంకల్పించామని వెల్లడించారు. మ్యాజిక్ ఆఫ్ ఛేంజ్ సంస్థతో కలిసి టీచర్లకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో సోమ, మంగళవారం మొదటి విడతలో 120 మంది, 19, 20 తేదీల్లో 118 మందికి శిక్షణ కొనసాగుతుందని వివరించారు.