హైదరాబాద్ : డెహ్రాడూన్‌లో శిక్షణలో ఉన్న 2021 బ్యాచ్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల శిక్షణలో ఉన్న అధికారుల బృందం క్షేత్ర పర్యటనలు, విజయవంతమైన అటవీ పద్ధతులను అధ్యయనం చేయడంలో భాగంగా హైదరాబాద్, సిద్ధిపేట, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, అటవీ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ట్రెయినీ ఐఎఫ్ఎస్ల బృందం ప్రశంసించింది.
కొత్త రాష్ట్రమైనా అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపును ప్రాధాన్యత పథకంగా అమలు చేస్తూ గొప్ప ఫలితాలు రాబట్టారని రాష్ట్ర అటవీ అధికారులను అధ్యయనం బృందం సభ్యులు మెచ్చుకున్నారు. తెలంగాణలో చూసిన, నేర్చుకున్న అటవీ పద్ధతులు తమ సర్వీసులో చాలా ఉపయోగపడతాయని ట్రెయినీ అధికారులు పేర్కొన్నారు. ముందుగా అరణ్య భవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులతో ఈ బృందం సమావేశమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత ఎనిమిదేళ్లుగా అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను పీసీసీఎఫ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఎర్ సంకల్పం, పట్టుదలతో పాటు అటవీశాఖకు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణకు హరితహారం విజయవంతమైందని, 270పైగా కోట్ల మొక్కలు నాటి, 7.7 శాతం పచ్చదనం వృద్ధిని రాష్ట్రమంతటా సాధించామని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఈ అధికారుల బృందం మేడ్చల్ కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, రాజీవ్ రహదారిపై పచ్చదనం, రహదారి వనాల అభివృద్ది (అవెన్యూ ప్లాంటేషన్), సిద్ధిపేట జిల్లా నర్సంపల్లి బ్లాక్ ప్లాంటేషన్, అటవీ పునరుద్ధరణ పనులు, ములుగు మోడల్ నర్సరీలను పరిశీలించారు. ప్రతిపాదిత ఫారెస్ట్ యూనివర్సిటీ క్యాంపస్ సందర్శించి, డీన్ ప్రియాంక వర్గీస్‌తో సమావేశమై ఫారెస్ట్ కాలేజీ విశిష్టతలను చర్చించారు.
రెండో రోజు ట్రెయినీ ఐఎఫ్ఎస్ల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో పర్యటించింది. క్షేత్ర స్థాయిలో అటవీ అధికారులకు ఎదురయ్యే సమస్యలు- పరిష్కార మార్గాలు, వన్యప్రాణుల భద్రత, అటవీ రక్షణ, అగ్ని ప్రమాదాలు అరికట్టే పద్ధతులను కొత్తగూడెం అటవీ అధికారులు వివరించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎంసీ పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అటవీ శాఖ నోడల్ అధికారి శాంతారామ్, డెహ్రాడూన్ అకాడెమీ ఫాకల్టీ గోక్రా వాట్మే, ఆయా జిల్లాలకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.