రాజన్న సిరిసిల్ల : కొడుకు(Son)) మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి (Mother)బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనా రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో జరిగింది . పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. ముస్కానిపేట గ్రామానికి చెందిన సాహెబ్ తన చిన్న కూతురు సాహేర(42) ను 25 ఏళ్లక్రితం వేములవాడ రూరల్ మండలం నాంపెల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు.
సాహేరకు ఒక కుమారుడు పుట్టిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదం(Road accident)లో ఆమె భర్త మరణించాడు. పసి గుడ్డును చేత పట్టుకుని కూతురు తల్లి ఇంటికి రావడంతో ఆమె సోదరులు ఒక చిన్న రూం ఏర్పాటు చేసి ఆమెను అందులో ఉంచారు. సాహెరా బీడీలు చేస్తూ తన కుమారుడిని పెంచి ఇంటర్ వరకు చదివించింది. తల్లికి ఆసరాగా ఉండేందుకు కొడుకు రహీం బంధువుల హోటల్‌ను నిర్వహిస్తున్నాడు.
అయితే ఇటీవల నిర్మించుకున్న ఇంటి కోసం అప్పు కావడంతో కొడుకు రహీం(22) మనస్తాపానికి గురై 20 రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్క కొడుకు మరణించడంతో తల్లి సాహేర తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు(Police) తెలిపారు.