నవీపేట/తాడ్వాయి/పోచమ్మమైదాన్, ఆగస్టు 9 : రాఖీ పండగ రోజు విషాదం నెలకొన్నది. సోదరి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు, సోదరులకు రాఖీలు కట్టి వెళ్తూ ఇద్దరు మహిళలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన వర్గంటి సాయినాథ్, కవిత దంపతుల కుమారుడు సాయిబాబా(19) నిజామాబాద్‌లో ఉంటున్న అక్కతో రాఖీ కట్టించుకునేందుకు స్కూటీపై వచ్చాడు. రాఖీ కట్టించుకుని తిరిగి వస్తుండగా నవీపేట మండలం జగ్గారావుఫారం వద్ద కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. సాయిబాబా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితుడు అర్వింద్‌కు స్వల్ప గాయాలయాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన మొగిలిపల్లి కృష్ణ, పద్మ దంపతులు(45)శనివారం అంకంపల్లికి బైక్‌పై వెళ్లారు.
పద్మ తన అన్నకు రాఖీ కట్టిన అనంతరం స్వగ్రామానికి వస్తుండగా నాంపల్లి సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో పద్మకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, కృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ములుగు జిల్లా మంచినీళ్లపల్లె గ్రామానికి చెందిన రాయనబోయిన శ్యామల(23) వరంగల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నది. రాఖీ పండగ కోసం తన తమ్ముడు శ్రీనుతో కలిసి బైక్‌పై శుక్రవారం రాత్రి స్వగ్రామానికి బయల్దేరారు. ఆరెపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ దాటిన తర్వాత బైక్ డివైడర్‌కు ఢీకొనడంతో శ్యామల తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి.