తాడూర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో ( Nagarkurnool district) విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ( Electrocution ) తల్లికొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. జిల్లాలోని తాడూర్ మండలం తుమ్మల సాగర్ గ్రామంలో గురువారం పిండి గిర్నిలో విద్యుత్ షాక్ తో జయమ్మ (38) , ఆమె కుమారుడు శ్రీకాంత్ (15) మృతి చెందారు.
కుమారుడు శ్రీకాంత్ గిర్నిను స్టార్ట్ చేయగానే విద్యుత్ షాక్‌కు గురై విలవిలలాడుతుండగా తల్లి గమనించి కాపాడేందుకు వెళ్లి ఆమె కూడా విద్యుత్ఘాతానికి గురైంది. ఈ ఇద్దరిని దూరం నుంచి గమనించిన కూతురు వెంటనే విద్యుత్ మీటర్‌ను ఆఫ్ చేసింది .
అప్పటికే తల్లి మృతి చెందగా కుమారుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడు. అంబులెన్స్‌కు వచ్చే సరికి అతడు కూడా మరణించడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాలను నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు . తాడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.