గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మొదటి భార్యను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గద్వాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కానీ వారికి పిల్లలు పుట్టలేదు. దీంతో భార్య చెల్లిని రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు నలుగురు సంతానం కలిగారు. అనంతరం మొదటి భార్యకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇదిలా ఉంటే.. రెండో భార్య కూతురు (16)పై సదరు వ్యక్తి కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధిత బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలని బాలికకు సదరు వ్యక్తి మొదటి భార్య గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించింది.
అయితే, ఈ విషయాన్ని బాధిత బాలిక ఇటీవల స్థానికంగా ఉండే మహిళకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లికి ఆమె జరిగిన విషయాన్ని వెల్లడించింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని, అతనికి సహకరించిన మొదటి భార్యను అదుపులోకి తీసుకున్నారు.