ఆసిఫాబాద్ టౌన్/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 19 : దీపావళి పండుగ కోసమని తన తమ్ముడు, ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారింటికి బయలు దేరింది ఆ మహిళ. అందరూ కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మోతుగూడెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలిలా.. వాంకిడి మండలం బెండారకు చెందిన జగన్ (27) దీపావళి పండుగ కోసమని తన అక్క డోంగ్రె అనసూయ(32)ను తీసుకొచ్చేందుకు కాగజ్‌నగర్ మండలం వంజరికి వెళ్లాడు.
అక్కతో పాటు ఆమె కుమారుడు ప్రజ్ఞాశీల్ (4), కూతురు హారిక(3)ను బైక్‌పై ఎక్కించుకొని తిరిగి వస్తుండగా, మోతుగూడెం సమీపంలోకి రాగానే.. ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నలుగురు గాల్లోకి ఎగిరి పడ్డారు. జగన్, అనసూయ, ప్రజ్ఞాశీల్ అక్కడికక్కడే మృతి చెందారు. హారికకు తీవ్ర గాయాలయ్యాయి. బాలికను మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ముగ్గురి మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని శోక సంద్రంలో మునిగిపోయారు. పండుగ పూట ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. మృతురాలికి భర్త సిద్దార్థ్ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, మోతుగూడ గ్రామస్థులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. మూడు గంటల పాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పట్టణ సీఐ బాలాజీవరప్రసాద్, ఎస్ఐలు ఉదయ్ కిరణ్, కొమురయ్య చేరుకొని న్యాయం చేస్తామని జెప్పగా శాంతించారు. సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.