మహబూబాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): విలువైన ఖనిజ సంపదపై అక్రమార్కులు కన్నేశారు. రాత్రికి రాత్రే బెరైటీస్‌ను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం శేరిపురం, పోచారం రిజర్వు ఫారెస్టులో బెరైటీస్ మైనింగ్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాత్రయితే చాలు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ముఠాలు, ట్రాక్టర్లు, యంత్రాలతో ఇక్కడ వాలిపోతున్నాయి. బెరైటీస్‌ను తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. బెరైటీస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గార్ల మండలంలో సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న బెరైటీస్ గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. మండలంలోని కొట్యానాయక్ తండా, బాలాజీ తండా, పాత పోచారం, నగరంలో బెరైటీస్ గనుల నిల్వలు వందల ఎకరాల్లో ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనులను లీజుకు ఇవ్వగా, ఆంధ్రాకు చెందిన ఓ మైనింగ్ కంపెనీ బెరైటీస్ గనుల లీజు పొంది యథేచ్ఛగా తరలించుకుపోయింది. అనుమతులకు మించి తవ్వకాలు జరిపి ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. 2008లో అనుమతులు పొందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టింది. 2014లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెరైటీస్ అనుమతి రద్దుచేసి మైనింగ్ తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. తెలంగాణ ఖనిజాన్ని బయటి రాష్ర్టాలకు పోనిచ్చేది లేదని కేసీఆర్ పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ అక్రమ దందాకు కాంగ్రెస్ నాయకులు తెరలేపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ముఖ్య నాయకుడి చొరవతో మళ్లీ బెరైటీస్‌ను అక్రమంగా తవ్వి అర్ధరాత్రి వేళల్లో తరలిస్తున్నారు. బెరైటీస్‌కు అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యతను బట్టి టన్నుకు గ్రేడ్-ఏకు రూ.25 వేలు, గ్రేడ్-బీకి రూ.15 వేలు, గ్రేడ్-సీకి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలుకుతున్నట్టు సమాచారం. పెట్రోల్ ట్యాంకుల నిర్మాణం, పరికరాల తయారీలో బెరైటీస్‌ను వినియోగిస్తారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అక్రమంగా బెరైటీస్ తరలింపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ముందుగా ట్రాక్టర్ల ద్వారా ఖనిజాన్ని ఒక చోటకు చేర్చి లారీల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో లారీలో 35 టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని తరలిస్తున్నారు. టన్నుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున 35 టన్నులకు సుమారు రూ.4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీ అధికారులు కందకాలు తవ్వినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఖనిజాన్ని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై గార్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈనెలలోనే ఒక ట్రాక్టర్ తీసుకెళ్తున్న సమయంలో ఇటీవల కురిసిన వర్షాలకు ట్రాక్టర్ దిగబడటంతో ఖనిజాన్ని అక్కడే అన్లోడ్ చేసి అక్రమార్కులు పరారయ్యారు.
పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశాం
గార్ల మండలం కోట్యానాయక్ తండా, బాలాజీనాయక్ తండా సమీపంలోని కంపార్ట్మెంట్ నంబర్ 42, 43,44వ అటవీ ప్రాంతంలో బైరైటీస్ ఖనిజం ఉన్నది. ఖనిజం తరలింపు జరుగుతుందనే సమాచార నేపథ్యంలో అటవీశాఖ సిబ్బందితో పది బృందాలను ఏర్పాటు చేశాం. గుట్టల చుట్టూ స్థానికులతోపాటు మా బృందాలతో 24 గంటల నిఘా ఏర్పాటు చేశాం. ఖనిజ తరలింపునకు వీలు లేకుండా బైరైటీస్ ఉన్న ప్రాంతం చుట్టూ కందకాలు తవ్వించాం. పెద్ద కందకాలు తవ్వేందుకు అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అనుమతి రాగానే చుట్టూ పెద్ద పెద్ద కందకాలు తీస్తాం. గతంలో ఖనిజాన్ని తరలించేందుకు లోపలికి వెళ్లిన ట్రాక్టర్‌ను సీజ్ చేశాం. ఖనిజం తరలిపోకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం.
– రమేశ్, డిప్యూటీ రేంజ్ అధికారి