Godavari | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం రాత్రి 9 గంటలకు 53.1 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక ఆల మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో 14,32,336 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడంతో భద్రాచలం- వెంకటాపురం, భద్రాచలం- ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు వెళ్లే రాష్ట్రీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బూర్గంపహాడ్ మండలంలోని సారపాక- నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, ఇరవెండి- అశ్వాపురం రహదారులపై రాకపోకలూ నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, గంగోలు, రేగుబల్లి గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. అత్యవసర సేవల కోసం ప్రభుత్వం భద్రాచలం పట్టణంలోని బీపీఎల్ స్కూల్ ప్రాంగణంలో హెలికాఫ్టర్‌ను సిద్ధంగా ఉంచింది.