రాష్ట్ర రాజధాని చిన్నపాటి వర్షం పడినా గజగజా వణికి పోతున్నది. భారీ వాన పడితే బెంబేలెత్తుతున్నది. రోడ్లపై వరద చేరి ఎక్కడికక్కడ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు స్తంభించిపోతూ నగరవాసులకు ‘గ్రేటర్’ ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నది. సాయంత్రం 5 అయిందంటే నగరం ‘చక్రబంధం’లో ఇరుక్కుపోతున్నది. 5 సెంటీ మీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే.. అధికార యంత్రాంగం మొత్తం చేతులెత్తేస్తున్నది. ట్రాఫిక్ నిర్వహణ గాడి తప్పి నగర పౌరులు నానా కష్టాలు పడుతున్నా సర్కారు కన్నెత్తి చూడటం లేదు. బీఆర్ఎస్ హయాంలోనూ భారీ వర్షాలు పడ్డాయని, అప్పుడు ఇంతటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని వాహనదారులు చెప్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): 2020లో అయితే ఏకంగా 32 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్‌ను నిర్వహించగలిగిన అధికార యంత్రాంగం ఇప్పుడెందుకు విఫలమవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేవారు. ట్రాఫిక్ నియంత్రణను కేవలం ట్రాఫిక్ విభాగంపైనే వదిలేయకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర విభాగాలను కూడా భాగస్వామ్యం చేస్తూ వేగంగా సమస్య పరిష్కరించేవారు. ఉన్నతాధికారులు అందరూ క్షేత్ర స్థాయికి వెళ్లి తగిన సలహాలు సూచనలు ఇచ్చేవారు. వారే దగ్గరుండి మరీ సమస్యను పరిష్కరించేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ సర్కారు తీరు ‘ప్రజలు ఏ ఇబ్బందులు పడితే మాకేంది’ అన్నట్టుగా ఉన్నది. అసలు గంటల తరబడి ట్రాఫిక్ ఎందుకు స్తంభిస్తున్నది? దీనికి పరిష్కార మార్గాలేంటి? అని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
నీరు పారిందంటే బండి ఆగాల్సిందే
నగరంలో 5 సెంటీ మీటర్లు.. కాదంటే మరో రెండు, మూడు సెంటీమీటర్ల వర్షం పడిందంటే తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్లో అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తగిన నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. వర్షాల కారణంగా ఇటీవల సైబరాబాద్, హైదరాబాద్‌లో చాలా చోట్ల భారీగా రాచకొండలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అత్యధికంగా ఐటీ కారిడార్‌లోని ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ రెండు, మూడు సెంటీ మీటర్ల వర్షం పడిందంటేనే ట్రాఫిక్ మొత్తం స్తంభిస్తున్నది.
పరిష్కారంపై స్పష్టతేది?
వర్షం కురిసినప్పుడు ఎక్కడెక్కడ నీళ్లు నిలుస్తున్నాయి? వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కడుంటాయనే అంశాలపై యంత్రాంగానికి అవగాహన ఉంటుంది. దీంతో ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారు. భారీ వర్షం పడ్డప్పుడు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి. రికార్డుల్లో ఉండే వాటర్ లాగింగ్ పాయింట్లకు అదనంగా రోడ్లపై భారీగా వర్షపునీరు వచ్చి చేరడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, మ్యాన్‌హోల్స్ ఎక్కడికక్కడే ఓపెన్ చేయడం, రోడ్ల పక్కన ఉండే నాలాలు పొంగి ప్రధాన రోడ్లపైకి రావడం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలనే విషయంలో ఆయా శాఖలకు ఇప్పుడు స్పష్టత లేకుండా పోయింది. ట్రాఫిక్ సిబ్బంది నోటీసులో ఉండే వాటర్ లాగింగ్ పాయింట్లు, చౌరస్తాల వద్దనే వారు విధుల నిర్వహణలో బిజీగా ఉంటున్నారు. గతంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురైనప్పుడు ట్రాఫిక్ పోలీసులకు శాంతి భద్రతల పోలీసులను కూడా సాయం కోసం రంగంలోకి దింపేవారు. నీళ్లు నిలిచే చోట సిబ్బంది ఒకరిద్దరిని మోహరించి వాహనాలు ఆగకుండా చూసేవారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించేవారు. నేడు ట్రాఫిక్, శాంతి భద్రతల పోలీసుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. భారీ వర్షం పడ్డ సందర్భాల్లో శాంతి భద్రతల విషయంలో తాము బిజీగా ఉన్నామని, ట్రాఫిక్ విధుల్లో తామెందుకు పాల్గొనాలని కొందరు అధికారులు కార్యాలయం నుంచి కాలు బయట పెట్టడం లేదు.
శాఖల మధ్య సమన్వయమేది?
ట్రాఫిక్ వ్యవస్థ అన్ని శాఖలతో ముడిపడి ఉంటుంది. పోలీస్, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, విద్యుత్తు, వాటర్ వర్క్స్ తదితర శాఖల సమన్వయం అవసరం. కానీ ఇప్పుడు ఆయా శాఖలు, మూడు పోలీస్ కమిషనరేట్ల అధికారుల్లో ఏమాత్రం సమన్వయం లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ట్రై పోలీస్ కమిషనరేట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏ రూట్లో సమస్య ఉన్నది? ఆ రూట్లో ఎంత వరకు క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి? ప్రత్యామ్నాయ రూట్లు ఏమిటనే విషయాల్లో నిరంతరం సమాచార మార్పిడి చేసుకుంటూ వాహనదారులకు తగిన సూచనలు చేసేవారు. నేడు ఉన్నతాధికారులే పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో అటు ట్రాఫిక్, ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బందిలో జవాబుదారీతనం లోపించదన్న విమర్శలు వస్తున్నాయి.
హైడ్రా ఎంట్రీతో శాఖల మధ్య అగ్గి
ట్రాఫిక్‌లోనూ హైడ్రా ఎంట్రీలో ఆయా శాఖల్లో సమన్వయం పూర్తిగా లోపించింది. ‘అంతా మేమే చూసుకుంటాం’ అంటూ హైడ్రా చూపిస్తున్న అత్యుత్సాహానికి ఆయా ప్రభుత్వ శాఖల మధ్య అగ్గిరాజుకుంటున్నది. ‘అన్నీ హైడ్రానే చూసుకుంటది కదా.. మనకెందుకులే’ అనే ధోరణి ఆయా శాఖల మధ్య విపరీతంగా పెరిగింది. హైడ్రాతో అటు పోలీసులుగాని, ఇటు జీహెచ్ఎంసీ గాని సమన్వయం చేసుకోకపోవడంతో అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపై పడుతున్నది. ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాల నిర్వహణ, రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్స్, చెట్లు, నిర్మాణాల బాధ్యత తమదేనని హైడ్రా చెప్పడంతో ఇతర ప్రభుత్వ శాఖలు చేతులెత్తేస్తున్నాయి. వర్షాలు కురిసి, రోడ్లపై వరద చేరినప్పుడు రంగంలోకి దిగి క్లియర్ చేసే పోలీసులు కూడా తమకెందుకులే అది హైడ్రా చూసుకుంటుందని మిన్నకుండిపోతున్నారు. అంతే కాకుండా ‘మీ విధులు మీరు నిర్వర్తించండి.. అనవసర విషయాల్లో జోక్యం వద్దు’ అంటూ ఉన్నత స్థాయి అధికారుల నుంచి పోలీసులకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది. దీంతో వర్షాలు కురిసిన సమయంలోనూ ట్రాఫిక్ పోలీసులు కేవలం జంక్షన్లకే పరిమితమవుతున్నారు. గతంలో సమన్వయంతో పనిచేసిన పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా ఎంట్రీతో తమకెందుకులే అని తప్పుకొంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పూర్తిగా చేతులెత్తేయడంతో రోడ్లపై వరద అవరోధాలను తొలగించే వారే కరువయ్యారు.
మాపై హైడ్రా పెత్తనమేంది?
‘మాకు సహకరించడానికి హైడ్రా సిబ్బందిని పంపారు. కానీ వారే మొత్తం చేస్తామని మాపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఒక్కో జంక్షన్‌కు ఐదుగురు సిబ్బందిని ఇచ్చామని చెప్తున్నరు కానీ ఎక్కడుంటారో తెల్వదు. వారి పెత్తనం కారణంగా మా వాళ్లు ఉండలేకపోతున్నారు. అసలు హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారో.. హైడ్రా బాధ్యతేంటో వారికే అర్థం కావడం లేదు. మాకు స్పష్టత ఉన్నా వారు వినరు. అన్నిట్లో జోక్యం చేసుకొని ఆగమాగం చేస్తున్నారు. అందుకే సిటీలో ట్రాఫిక్ నియంత్రణ మొత్తం పట్టు తప్పింది. మేం చెప్తే ఆయన వినరు.. ఆయన చెప్పిం ది విందామంటే మా బాస్‌లు ఒప్పుకోరు.. మాకెందుకీ తలనొప్పి? అందుకే మా పని మేం చేసుకుంటు న్నాం’అంటూ ఓ సిటీ పోలీసు అధికారి వాపోయారు.
డ్యూటీలు చేసుకోకుండా అడ్డు
అసలు తమ డ్యూటీలను తాము చేసుకోనివ్వకుం డా హైడ్రా అడ్డుపడుతున్నదని, ఎక్కడైనా డ్యూటీ చేసే సమయంలో హైడ్రా సిబ్బంది పెత్తనం చెలాయిస్తూ వారు చెప్పినట్టు చేయాలని డిమాండ్ చేస్తుంటే తాము ఎలా పనిచేయాలని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సివిల్ పోలీసులు రాకుండా, ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ చేయకుండా హైడ్రా అడ్డుకుంటున్నదని, పైకి కోఆర్డినేషన్ ఉన్నదని చెప్తూనే అంతర్గతంగా తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ‘ఈ వారంలో కురిసిన వర్షాల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కూడా తామే చేస్తున్నట్టు హైడ్రా కమిషనర్ చెప్పుకొన్నారు. మమ్మల్ని ఆయన కంట్రోల్లో పనిచేయమంటే మా బాస్‌లకు మేమేం చెప్పుకోవాలి’ అని వాపోయారు. రంగనాథ్ చేతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిలైందని, ఇంతకుముందు అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసేవని, ఇప్పుడు ఏశాఖలో అడిగినా హైడ్రానే చూసుకుంటదని చెప్తున్నారని, అందుకు తగ్గట్టుగా కేవలం ఫొటోల కోసం హైడ్రా బృందాలు అన్ని శాఖల్లో వేలుపెట్టి తర్వాత పత్తా లేకుండా పోతున్నాయని కొందరు అధికారులు చెప్తున్నారు.
ముంపు లేకుండా చేస్తామని హైడ్రా డబ్బా
వానకాలంలో వరద ముంపు లేకుండా చేస్తామని జూన్ 11న హైడ్రా ప్రకటించింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 51 డీఆర్ఎఫ్ బృందాలతో వరద ముప్పును నివారించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటామని, నివాస ప్రాంతాల్లో వరద నిలువకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. కానీ ఒక్క గురువారం కురిసిన వర్షానికే ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో 500కు పైగా బైకులు నీట మునిగాయి. మరికొన్ని బైకులు వరదలో కొట్టుకుపోయాయి. వందలాది ఇండ్లలోకి వరద చేరింది. ఈ క్రమంలో అసలు హైడ్రా చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు హైడ్రా తీరుపై మండిపడుతుంటే తాము కేవలం ట్రాఫిక్ నియంత్రణలో మాత్రమే సహకరిస్తామని హైడ్రా చెప్తున్నది. కానీ క్షేత్రస్తాయిలో స్వయంగా హైడ్రా కమిషనరే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి హైడ్రా 150 మందికి ట్రైనింగ్ ఇచ్చింది. వీరిలో మొదటి బ్యాచ్ 50 మందిని ట్రాఫిక్ కంట్రోలింగ్‌లో పోలీసులకు సాయంగా పెట్టినా మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది.