NREGA | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త కొత్త కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. కొన్నేళ్లుగా పనిదినాలను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇదే కోవలో తాజాగా ఈ పథకంలో పెండింగ్ పనులను పక్కనబెట్టి కొత్తవాటినే చేపట్టాలని నిర్దేశిస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో లక్ష్యం మేరకు పనిదినాలు కల్పించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధిహామీలో కొత్త పనులే చేపట్టాలని కేంద్రం నిర్దేశించడంతో పనిదినాల పూర్తిపై రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలకు ఇప్పటికే సుమారు 10.3 కోట్ల పనిదినాలు పూర్తిచేసింది. మిగిలిన 27 రోజుల్లో 1.7 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పనులపై దృష్టిపెట్టింది.
పేదలకు ఉపాధినిచ్చి ఆర్థిక, ఆహార సాధికారిత కల్పించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం అమలుపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు పనిదినాలు తగ్గించింది. వేతనాలివ్వడం, పెంపుపై అలక్ష్యం చేస్తున్నది. తాజాగా చేపట్టిన పనులే మళ్లీ చేస్తున్నారనే సాకుతో పాత పనులకు మంగళంపాడింది. ఈ నిబంధనతో పనులు పూర్తిచేసేందుకు అవరోధాలు ఎదురవుతున్నాయి. దీంతో గ్రామీణులకు మౌలిక సౌకర్యాల కల్పన ఇబ్బందికరంగా మారనున్నది.
ఉపాధిహామీ కింద పాతపనులను చేపట్టవద్దని కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై కార్మిక సంఘాలు, కూలీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సర్కారు తెచ్చిందనే నెపంతో పూర్తిగా ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. అందుకే కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే ఈ నిబంధనను ఎత్తేయడంతోపాటు పనిదినాల సంఖ్యను పెంచాలని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.