హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : రెండుసార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా.. మూడు రోజులు సమ్మె చేసినా.. ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డేకు నేటికీ మోక్షం కలుగలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనమే ప్రధాన అంశంగా ఏప్రిల్‌లో కార్మికులు సమ్మెకు దిగారు. నాడు సమ్మె భారం నుంచి తప్పించుకొనేందుకు అతి త్వరలోనే అపాయింటెడ్ డే ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ మొదలుపెట్టలేదు. కార్మిక సంఘాల నేతలు జూన్ 2నే అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న కచ్చితంగా అపాయింటెడ్ డే ప్రకటిస్తారని వేల కండ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, సమ్మె తర్వాత వారి తరఫునుంచి ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు అపాయింటెడ్ డేను పట్టించుకోవడం లేదని కార్మికులు చెబుతున్నారు. రేవంత్ సర్కార్ తమను మోసం చేస్తున్నదని వాపోతున్నారు. శనివారం నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో అపాయింటెడ్ డే గురించి చర్చ వస్తదని, దానిపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశించిన కార్మికులకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేసేందుకు హడావుడిగా ఏర్పాటు చేసిన కమిటీలు ఏ ఒక్కటీ ఈ విషయంలో యాక్టివ్‌గా లేవని కార్మిక నేతలు అంటున్నారు. విలీనం కోసం వేసిన అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు సమ్మె ముగిసి నెల రోజులు అవుతున్నా ఒక్కసారి కూడా భేటీ కాలేదని చెబుతున్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలపై సమ్మె అనంతరం కార్మిక నేతలు సీఎంను కలిశారు. అయితే సీఎం ఓ మెలిక పెట్టారు. యూనియన్లు, విలీనం వంటి అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకోవాలని అన్నారు. ‘ఆర్టీసీ విలీనం ఎలా చేద్దాం.. ఎన్నికలు ఎలా నిర్వహించుకుందాం అనే విషయాలపై మీ సంఘాలన్నీ కూర్చొని చర్చించుకోండి. ఆ చర్చల సారాంశాన్ని మాకు రాసి పంపండి’ అని ఆదేశాలివ్వడంతో దాదాపు 14 సంఘాల నేతలు వారికి తోచిన అంశాలను సీఎంకు పంపారు. ఆ అంశాలను ఆయన పరిశీలించారో లేదో తెలియదు. సమ్మె ముగిసి నెలరోజులవుతున్నా నేటికీ దానిపై ఎలాంటి స్పష్టత లేదు. విలీనం, యూనియన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వమే కార్మిక సంఘాలపై భారం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సంఘాల్లో ఐక్యత లేకపోవడం వల్లే సీఎం ఆ నిర్ణయం తీసుకున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీనికితోడు విలీన కమిటీలో కార్మిక సంఘాలు ఉండాలని మెలిక పెట్టడంతో ఆ ఎన్నికల నిర్వహణ కూడా ఇప్పట్లో అయ్యేటట్టు లేదు.
ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని కాంగ్రెస్ నేతలు రాష్ట్రమంతా విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ‘ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఆ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే రెండు పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీజీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం’ అని చెప్పారు. ఆర్టీసీ బస్‌లను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అంటూ హామీలు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లు వేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారేమోనని నాటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు.