Revanth Reddy | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): అబద్ధాలకు కూడా ఓ హద్దుంటుంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం అన్ని హద్దులనూ దాటేశారు. చరిత్రనే మార్చేస్తూ వక్రభాష్యం చెప్పా రు. అబద్ధాలను అలవోకగా వల్లె వేశారు. అమెరికాలో తాను చేసిన ‘ఉచిత కరెంట్ వ్యాఖ్యల’పై వివరణ ఇచ్చుకొనేందుకు హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్‌రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉచిత విద్యుత్తు ఇవ్వడం కుదరదని ఆనాడు కేసీఆర్ టీడీపీ సర్కారుతో చెప్పించారని, బషీర్‌బాగ్ కాల్పులకు కేసీఆర్ కూడా కారణమంటూ అసత్య ఆరోపణలు చేశారు. నిజాలను కప్పిపుచ్చుతూ సీఎం కేసీఆర్‌పై నెపమంతా వేసేందుకు పన్నాగం పన్నారు. అసలు ఉచిత విద్యు త్తు ఊసేలేని ఆ కాలంలో కేసీఆర్ ఫ్రీ కరెంట్‌ను వ్యతిరేకించారంటూ మీడియా ఎదుట అబద్ధాలు చెప్పారు. తాను ఉచిత కరెంట్‌పై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలనుంచి సెగ తగలడంతో ఫ్రస్టేషన్లో రేవంత్‌రెడ్డి నోటికి ఏదివస్తే అది వాగేసి మీడియా ఎదుట అడ్డంగా దొరికిపోయారు.
నాడు టీడీపీలో ఉంటూ విద్యుత్ చార్జీలను పెంపును కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై నాటి సీఎం చంద్రబాబును నిలదీశారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నా విద్యుత్ చార్జీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాబుకు లేఖ రాశారు. చార్జీల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం తెలంగాణ రైతుల గొంతులకు ఉరితాడు బిగించడమే అవుతుందని తేల్చి చెప్పారు. ఒకవేళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో తాను ఉద్యమించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. టీడీపీలో ఉంటూ విద్యుత్తు చార్జీల పెంపుపై అప్పటికే పవర్ఫుల్ సీఎం, జాతీయ నేతగా వెలుగొందుతున్న చంద్రబాబును వ్యతిరేకించిన కేసీఆర్‌పైనే రేవంత్‌రెడ్డి విషం చిమ్మే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రేవంత్‌రెడ్డి ఇదే నా నీ సంస్కారం?’ అంటూ తెలంగాణ ప్రజలు టీపీసీసీ చీఫ్‌పై మండిపడుతున్నారు. కాగా, ప్రెస్‌మీట్ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రవర్తన, ఆయ న హావభావాలపై విలేకరులు, పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ జరిగింది. సబ్జెక్ట్ లేకపోవడంతో ఫ్రస్టేషన్లో రేవంత్‌రెడ్డి బూతుపురాణం అందుకొన్నారనే విమర్శలు వినిపించాయి.
2000 ఆగస్టు 28న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తా అట్టుడికింది. పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమించిన అన్నదాతలపై నాటి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు కాల్పులు జరిపించింది. ఈ ఘటనలో ముగ్గురు రైతులు మరణించారు. అసలు జరిగింది ఇదైతే.. రేవంత్‌రెడ్డి ఈ ఘటనను సీఎం కేసీఆర్‌కు ఆపాదించే ప్రయత్నం చేశారు. నాడు ఉద్యమం చేసి తూటా దెబ్బలు తిన్న కామ్రేడ్స్ సైతం ఆశ్చర్యపోయేలా అసత్య ఆరోపణలు చేశారు. నాడు జరిగిన బషీర్‌బాగ్ కాల్పులు ఉచిత విద్యుత్తు కోసమంటూ చరిత్రను వక్రీకరించారు.