హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు ఉన్నది నిజమేనని, వాటి పరిష్కారానికి జిల్లాల వారీగా కమిటీలు వేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆ పది నియోజకవర్గాలలో కొత్త, పాత నేతల మధ్య గొడవలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి వేసే కమిటీలో ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, నదీజలాల విషయంలో కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 16న నిర్మల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. మహిళా ఐఏఎస్‌ల విషయంలో సోషల్‌మీడియాలో అడ్డగోలుగా రాస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని మహేశ్‌కుమార్ తెలిపారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఆదరించే పరిస్థితులు లేవని చెప్పారు. హిందువుల పేర్లమీద ఓట్లు అడిగే సంసృతి బీజేపీది అన్న ఆయన.. తాము సైతం హిందువులమేనని రోజూ గుడికి వెళ్తామని చెప్పారు.