హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ మూలాలు ఉన్నవారికి, ఆరెస్సెస్ ఏజెంట్లకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి టికెట్లు కేటాయించారని పీసీసీ మాజీ సభ్యుడు, మైనార్టీ సెల్ చైర్మన్ అబ్దుల్లా సోహైల్ షేక్ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కేటాయించిన టికెట్లలో 25 టికెట్లు ఆరెస్సెస్ ఏజెంట్లకు, నోట్లకట్టలు గుమ్మరించినవారికే ఇచ్చారని విమర్శించారు. ఆదివారం ఆయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పటినుంచో కాంగ్రెస్‌లో ఉన్న తమలాంటి వారిని దొంగ సర్వేల పేరుతో పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 ఏండ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగిన తాను ఎంతో బాధతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. తన రాజీనామాకు రేవంత్ కారణమని పేర్కొన్నారు. మైనార్టీ సెల్ చైర్మన్‌గా తాను బీజేపీకి సంబంధించిన వ్యక్తులకు ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు.