హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ధర్నాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు మినహా ఇతర ఎలాంటి కేసులున్న వ్యక్తులకు అవకాశం కల్పించవద్దని టీపీసీసీ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ కూర్పుపై టీపీసీసీ కార్యాచరణను రూపొందించింది. కాంగ్రెస్ జిల్లా కార్యవర్గాల ఏర్పాటు అంశాలపై టీపీసీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది.
బుధవారం హైదరాబాద్‌లో కార్యవర్గంలోని సభ్యుల సంఖ్య, హోదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఇన్చార్జి సెక్రటరీలు విశ్వనాథన్, సచిన్ సావంత్ చర్చించారు. జిల్లా పదవుల్లో 20-25శాతం మహిళలకు అప్పగించాలని పేర్కొన్నారు. డీసీసీ నియామకంలో జిల్లాకొక కోశాధికారిని నియమించాలని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి బ్లాక్ నుంచి ఒక ఉపాధ్యక్షుడు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఉండేలా చూడాలని సూచించారు.