Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): నిన్న రైతులను బిచ్చగాళ్లంటూ ప్రేలాపనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఉస్మానియా విద్యార్థులనూ ఘోరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా విద్యార్థులు అడ్డా మీది కూలీలని, ఖర్చులకు చిల్లర ఇస్తే అరుస్తూనే ఉంటరంటూ దారుణంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఓ చానల్ ఇంటర్వ్యూలో ఉస్మానియా విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో ఓయూ విద్యార్థులను తీవ్రస్థాయిలో అవమానించేలా మాట్లాడటం గమనార్హం.
ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ ‘ఉస్మానియా విద్యార్థులు యూనివర్సిటీకి రాహుల్‌గాంధీ రాకను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నారు’ అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెప్తూ ‘ఏం లేదు. ఉస్మానియా విద్యార్థులు కేటీఆర్ దగ్గరికి పోయి చిల్లర ఖర్చులకు తెచ్చుకొని ఉంటరు. ఇంకేముంది అ పక్కనే తార్నాకలో ఉన్న బార్లో ఓ బీర్ తాగి, బిర్యాని తిని అది అరిగే వరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటరు. వాళ్లది ఏముంటది? అడ్డా మీది కూలీల్లాంటోళ్లు. వాళ్లకంటూ ఓ సిద్ధాంతం గానీ, వాళ్లకంటూ ఓ ఆలోచన గానీ, వాళ్లకంటూ తెలంగాణ పట్ల గౌరవం అంటూ ఏమీ లేవు’ అని తన అహంకారాన్ని తెలియజేసేలా వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యలతో కేవలం విద్యార్థులనే కాదు.. ఉస్మానియా యూనివర్సిటీనే అవమానించారంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. తెలంగాణకే తలమానికమైన ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓయూ విద్యార్థులపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చరిత్ర మరిచి మాట్లాడటంపై మండిపడుతున్నారు. తన అవసరాల కోసం ఉస్మానియా విద్యార్థులను వాడుకున్నప్పుడు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మేలు కోసం అక్కడి విద్యార్థులను ఎగదోసిన విషయాన్ని మర్చిపోయావా? అని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ కోసం ఎంతగానో శ్రమించిన ఉస్మానియా విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్‌కు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎంతోమంది ఉస్మానియా విద్యార్థులను వాడుకొని మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తిరిగి అదే విద్యార్థులపై విచ్చలవిడిగా మాట్లాడటమా? అని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఉస్మానియా విద్యార్థులపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విద్యార్థి లోకంలో మంట పుట్టిస్తున్నాయి. ఉద్యమాల పురిటి గడ్డపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్‌కు నాటి నుంచి ఓయూపై కక్ష సాధింపే ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఓయూ, అక్కడి విద్యార్థులు ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే. ఎంత మంది విద్యార్థులు తెలంగాణ కోసం అసువులు బాసారు. అదే ఓయూలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ సాగించింది. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీలతో చావబాదారు. విద్యార్థులపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగించింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉస్మానియా విద్యార్థులపై విషం చిమ్మారు. ఉస్మానియా యూనివర్సిటీని, విద్యార్థులను అవమానించేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్తామని విద్యార్థి లోకం హెచ్చరించింది.