Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను మీడియా ముందు ఎలా మాట్లాడతారని అసహనం వ్యక్తం చేశారు.
ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడటం సరికాదని మహేశ్‌కుమార్ గౌడ్ హితవుపలికారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా, ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆదివారం నాడు అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టం వస్తుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని తెలిపారు. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.