న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిది అక్రమ కట్టడమే అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పరోక్షంగా అంగీకరించారు. తిరుపతిరెడ్డి ఇల్లును కూ లగొట్టడానికి హైడ్రా బుల్డోజర్లు వెళ్లాయి కానీ స్థానికులు కోర్టు ఆర్డర్ తీసుకురావడంతో ఆగాల్సి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. సామాన్యుడికి హైడ్రాతో ఇబ్బంది లేదని, కబ్జా చేసిన వా రికి మాత్రమే ఇబ్బందులు ఉంటాయని అన్నారు.
తిరుపతిరెడ్డి దుర్గంచెరువు భూమిని కబ్జా చేసి భవనం కట్టుకున్నారని, హైడ్రా తమ ఇండ్ల మీదకి రావటానికి ముందు ఆ ఇంటి మీదికి పోవాలని హైడ్రా బాధితులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ తిరుపతిరెడ్డి ఇంటి గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా మహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీలో సీఎం సోదరునిది అక్రమ కట్టడమే అని పరోక్షంగా తేల్చి చెప్పటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టే అవకాశం కనిపిస్తున్నది. ఇక ఫార్మలా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు తప్పదని మహేశ్ కుమార్ వ్యాఖ్యానించారు.