దుండిగల్, మార్చి18 : హైదరాబాద్‌లోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం… ఏడాదికాలంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి ఏసీపీగా పని చేస్తున్న ఎం శ్రీనివాస్‌రావు ప్రగతినగర్‌లో ఓ చీరెల షాపు హోర్డింగ్‌ను అనుమతి లేదని వారంలో రెండు సార్లు తొలిగించారు. దీంతో దుకాణ యాజమాని గొట్టిపాటి శ్రీనివాసులు నాయుడు మళ్లీ హోర్డింగ్ ఏర్పాటుకు ఏసీపీ శ్రీనివాసరావును అడుగగా, తనకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో శ్రీనివాసనాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు సోమవారం సాయంత్రం ఏసీపీ శ్రీనివాసరావు పంపిన ఓ పార్టీ నాయకుడు రాములునాయక్‌కు డబ్బులు అందజేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో రాములునాయక్, శ్రీనివాస్‌రావును విచారించారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌రావును అరెస్ట్ చేశారు. సోదాల్లో సీఐలు ఆకుల శ్రీనివాస్, మల్లికార్జున్, పురందర్బట్తో పాటు మొత్తం15మంది సిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్ : కల్యాణ లక్ష్మి డబ్బుల కోసం లంచం అడిగిన అధికారిని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సోమవారం సస్పెండ్ చేశారు. జిల్లాలోని కీసర తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసే రమేశ్ కల్యాణలక్ష్మి పథకానికి లబ్ధిదారుల నుంచి లంచం అడగినట్లు ఆర్డీవో విచారణలో వెల్లడైంది. దీంతో రమేశ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.