KCR | మహదేవపూర్, డిసెంబర్ 14 : రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ సారే అధికారంలోకి వస్తరని మేడిగడ్డ బరాజ్‌కు వచ్చిన పర్యాటకులు పేర్కొన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌ను వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు సందర్శించి సంబురపడ్డారు. గతంలో ఇదే బరాజ్ భారీ వరదలను, ఇటీవల భూకంపాన్ని సైతం తట్టుకొని నిలబడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ బరాజ్ నిండుకుండలా ఉం డేదని, నేడు నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని అన్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారని పేర్కొన్నారు. బరాజ్‌తో మారుమూల గ్రామాల్లోని బావులు, చెరువుల్లోకి నీరు చేరి పంటలు సమృద్ధిగా పండాయని, భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య లేకుండా పోయిందంటే అది కేసీఆర్ చలువేనని కొనియాడారు. అంతటి గొప్ప ప్రాజెక్ట్‌ను ఇలా రాజకీయాలకు బలి చేయడం దారుణమని అన్నారు. మళ్లీ కేసీఆర్ వచ్చి ఉంటే మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు పూర్తయి రైతులందరికీ మేలు జరిగి ఉండేదని తెలిపారు. బరాజ్ ఎడారిని తలపించేలా మారడాన్ని చూస్తే గుండె తరుక్కుపోతున్నదని ఆవేదన చెందారు. రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ సారే వస్తారని జోస్యం చెప్పారు.
కేసీఆర్ సారు ఎంతో ముందుచూపుతో రైతులు, ప్రజలకు తాగు, సాగు నీరందించేందుకు మేడిగడ్డ బరాజ్ నిర్మించారు. బరాజ్‌లో ఒక చిన్న కుంగుబాటును సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టునే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది.
– శంకరమ్మ, మాజీ సర్పంచ్, మోటకొండూరు, యాదాద్రి