ఖిలావరంగల్, అక్టోబర్ 26: చారిత్రక వైభవానికి, కాకతీయుల కళా నైపుణ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓరుగల్లు కోట (వరంగల్ కోట) ఇప్పుడు సమస్యల కోటగా మారింది. కోట అందాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకులకు కనీస మౌలిక వసతులు కరువై వెనుదిరిగి వెళ్తున్నారు. మరోవైపు, కోటలో పంటలు పండించే రైతులు పంట దిగుబడిని మార్కెట్కు తరలించడానికి ముళ్ల పొదలు, చెత్తాచెదారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పర్యాటకులకు చేదు అనుభవం
కోట చుట్టూ నిర్మించిన సీసీ రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ మొక్కలు ఏకంగా రోడ్డును కమ్మేయడంతో, పర్యాటకుల కార్లలో వెళ్లడం పక్కన పెడితే కనీసం నడుచుకుంటూ వెళ్లి కోట చారిత్రక కట్టడాలను, అందాలను వీక్షించలేని దుస్థితి ఏర్పడింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఈ దీన స్థితిని చూసి నిరాశతో కోటను పూర్తిగా చూడకుండానే వెనుతిరిగిపోతున్నారు. రోడ్డుకిరువైపులా చెట్లు పెరిగిన విషయం తెలియని పర్యాటకులు తమ విలువైన కార్లతో లోపలికి వస్తున్నారు. దీంతో కారుకు గీతలు పడడంతో పర్యటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని అధికార యంత్రాంగం తీరుపై పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
రైతుల పరిస్థితి మరింత దయనీయం
ఓరుగల్లు కోటలో, పరిసర ప్రాంతాలలో ఆకుకూరలు, కూరగాయలు పండించే రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పండించిన పంటను, కూర మూటలను మార్కెట్కు తరలించడానికి కోట చుట్టూ ఉన్న రహదారి వెంట పెరిగిన ముళ్ల పొదలు, పిచ్చి చెట్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను మోసుకెళ్లే మార్గం సరిగా లేక, తరలింపు సమస్యగా మారి ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారా..?
అసలు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారా? అని స్థానికులు, పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. సమీక్షలు, సమావేశాలకే పరిమితమై, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి ఎటువంటి కార్యాచరణ లేదని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. చారిత్రక కోటకు ఈ దుస్థితి పట్టడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కోట చుట్టూ ఉన్న సీసీ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, ముళ్ల పొదలు, పిచ్చి చెట్లను తక్షణమే తొలగించాలని స్థానికులు, రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులకు, రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను వారు కోరుతున్నారు. చారిత్రక వారసత్వ సంపదగా ఉన్న ఓరుగల్లు కోట పరిరక్షణ, అభివృద్ధి పట్ల పాలక వర్గాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.