హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టుకు ‘టూరిజం మిత్ర’ అవార్డు లభించింది. శుక్రవారం కోల్‌కతాలో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సులో ఈ అవార్డును బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అందుకొన్నారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి అధ్యక్షుడు రవీంద్రపంత్, ప్రధానకార్యదర్శి కౌలేశ్కుమార్ మాట్లాడుతూ బుద్ధవనం ఆసియా దేశాల్లోనే ప్రత్యేకమైనదని, ఇందులోని బౌద్ధశిల్పకళ, బౌద్ధ పర్యాటకాభివృద్ధికి, బౌద్ధ సంస్కృతి పరిరక్షణ, శాంతిని పెంపొందించేందుకు ఎంతో దోహదం చేస్తున్నాయని అన్నారు.