Runa Mafi | సోన్, ఆగస్టు 2 : ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసినా తమ పేర్లు లిస్ట్‌లో ఎందుకు లేవు? అని రైతులు శుక్రవారం నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ బ్యాంకు పరిధిలో మొత్తం 900 మంది రుణాలు తీసుకోగా 204 మందికే మాఫీ జరిగిందనన్నారు. రుణమాఫీపై వ్యవసాయశాఖ అధికారులకు ప్రభుత్వం ఓ యాప్ అందుబాటులోకి తెచ్చినా అందులో కూడా తమ వివరాలు లేవని వాపోయారు. బ్యాంకు అధికారులు వెంటనే స్పందించి బ్యాంకులో తీసుకున్న రూ. లక్షా యాభై వేల రుణాల జాబితాను ప్రభుత్వానికి పంపి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
లక్ష రుణం మాఫీ కాలె
నేను సోన్‌లోని ఇండియన్ బ్యాంకులో పదేండ్ల నుంచి వ్యవసాయ రుణం తీసుకుంటున్నా. నిరుడు లక్ష రుణం తీసుకున్నా. ప్రభుత్వం మాఫీ చేస్తదని ఎంతో సంబురపడ్డా. కానీ లిస్ట్‌లో నా పేరు లేదు. అధికారులను అడిగిన సరైన సమాధానం చెప్తలేరు. నా రుణం మాఫీ చేసి న్యాయం చేయాలి.
-దాసరి రాజేందర్, మం:సోన్, జిల్లా: నిర్మల్
రుణ మాఫీ చేయాలి..
నేను సోన్‌లోని ఇండియన్ బ్యాంకులో గతేడాది రూ.లక్ష రుణం తీసుకున్న. ప్ర భుత్వం ఒకటి, రెండో విడతలుగా రుణాలు ఇప్పటివరకు రూ.లక్షన్నర వరకు మాఫీ చేసింది. కానీ నాకు మాఫీ కాలేదు. ఎందుకు కాలేదో అర్థమైతలేదు. అధికారులు నా రుణం మాఫీ అయ్యేలా చూడాలి.
-ఆకుల ముత్తన్న, రైతు, సోన్, నిర్మల్ జిల్లా
రుణమాఫీలో విచిత్రాలెన్నో..
రంగారెడ్డి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): రుణమాఫీ పథకంలో రంగారెడ్డి జిల్లాలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఆశగా మాఫీకోసం ఎదురు చూసిన రైతులకు అడుగడుగునా చిక్కులే ఎదురవుతున్నాయి. జాబితాలో సవాలక్ష లోపాలు వెలుగుచూస్తున్నాయి. చేవెళ్ల మండలం చనువెల్లికి చెందిన ఓ రైతుకు రూపాయి మాత్రమే మాఫీ అయింది. సదరు రైతు రూ.లక్షలోపు తీసుకున్న రుణం మొదటి విడతలోనే మాఫీ కాగా.. రెండో విడత జాబితాలో రూపాయి మాఫీ కావడం విస్తుగొలుపుతున్నది. ఇదే మండలానికి చెందిన మరో రైతు బ్యాంకులో తీసుకున్న రుణాన్ని మొత్తం తీర్చేశాడు. బ్యాంకులో ఎటువంటి అప్పులేకపోగా.. రూ.5 మాఫీ అయినట్టు జాబితాలో చూపిస్తున్నది. ఇటువంటి విచిత్రాలు రంగారెడ్డి జిల్లాలో రుణ జాబితాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఇందుకు గల కారణాలపై అటు బ్యాంకుల అధికారులుగాని, వ్యవసాయ అధికారులు గాని స్పష్టత ఇవ్వకపోవడంతో రుణమాఫీ జాబితాపై గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
వడ్డీ కడితేనే అసలు మాఫీ ప్రభుత్వ షరతులతో రైతుల ఇబ్బందులు
వికారాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంట రుణాలకు సంబంధించి అసలుతోపాటు వడ్డీని కూడా మాఫీ చేస్తున్నామని చెబుతున్నా వికారాబాద్ జిల్లాలోని పలు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల్లో కేవలం అసలు మాత్రమే మాఫీ అవుతున్నట్టు రైతులు చెబుతున్నారు. 9 డిసెంబర్ 2023 లోపు ఉన్న పంట రుణాలకు సంబంధించి అసలుతోపాటు మిత్తీని మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి మాత్రం వడ్డీ చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని, రైతుల నుంచి ముక్కు పిండి వడ్డీ డబ్బులను బ్యాంకర్లు వసూలు చేస్తున్నారు. సదరు బ్యాంకర్లు వడ్డీతో కలిపి కాకుండా అసలు రుణాల జాబితాను పంపడంతోనే వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.