హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏకంగా 5,250 ప్రభుత్వ బడుల్లో ఆట మైదానాలు లేవు. అంటే 25% సర్కార్ స్కూళ్లల్లో విద్యార్థులు ఆటలాడుకునే పరిస్థితులు లేవు. సమీపంలోని మున్సిపల్, ఇతర మైదానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బడులవారీగా తీసుకుంటే 5,250 మైదానాల్లేని బడుల్లో ఏకంగా 4,233 ప్రాథమిక బడులున్నాయి. 509 ప్రాథమికోన్నత, 473 ఉన్నతపాఠశాలలు, 35 హయ్యర్ సెకండరీ స్కూళ్లల్లో మైదానాలు లేవని విద్యాశాఖ వర్గాలు స్పష్టంచేశాయి. యాజమాన్యాలవారీగా పరిశీలిస్తే వీటిలో 4,580 ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడులే ఉన్నాయి. మరో 551 ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలలు, 53 కేజీబీవీలు ఉన్నాయి. మూడు మాడల్ స్కూల్స్, 62 ఆశ్రమ పాఠశాలలు ఆటస్థలాల్లేని బడుల జాబితాలో ఉన్నాయి. బడులకు పాఠశాల విద్యాశాఖ స్పోర్ట్స్ గ్రాంట్‌ను మంజూరుచేసింది. అన్ని బడులకు కలిపి రూ. 2.81 కోట్లు మంజూరు చేసింది.