పెద్దపల్లి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలోక్ అలియాస్ దేశ్‌పాండే గోపన్న(70) మరణించినట్టు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరియా ఉసూరు బ్లాక్‌లో అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందినట్టు తెలిసింది. అతడి పేరిట ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ.కోటి, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డులు ప్రకటించాయి.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ పంచాయతీ పరిధిలోని శాస్ర్తుళ్లపల్లికి చెందిన రాజిరెడ్డి ఇంటర్ చదువుతున్న సమయంలో 1975లో ఆర్ఎస్యూలో చేరా రు. 1977లో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. 2007లో పకా సమాచారంతో కేరళలోని అంగన్మలై ప్రాంతంలో పోలీసులు ఆయన్ను పట్టుకుని 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు నెలల జైలు శిక్ష తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌తో కూడిన మావోయిస్టు నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్చార్జిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జబ్బగుట్ట ఏరియా ఉసూరు బ్లాక్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఆయన మృతిని మావోయిస్టు పార్టీగానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ధ్రువీకరించలేదు.