ఇందిరమ్మ రాజ్యం.. ప్రజాపాలన అంటూనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగిస్తున్న పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నది. న్యాయస్థానాల తీర్పులంటే లెక్కలేదు.. ప్రజాస్వామ్యానికి తావులేదు.. చట్టాల స్ఫూర్తికి విలువ లేదు.. ప్రశ్నించిన వారిపై కేసులు.. నిలదీసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగాలతో మొత్తంగా తెలంగాణలో నియంతృత్వ పోకడ నడుస్తున్నది.
నిన్నటికినిన్న సైబర్ నేరాల నియంత్రణ నెపంతో సోషల్‌మీడియా వారియర్లపై రౌడీషీట్లు తెరవడానికి సిద్ధమైన రేవంత్ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా పౌరుల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే శక్తిమంతమైన టూల్స్ కొనుగోలు చేయనున్నది.
వీటిద్వారా ఆండ్రాయిడ్.. యాపిల్.. ఫోన్ ఏదైనా సరే.. వాటికి చెవులు, కండ్లు రాబోతున్నాయి. మనం మాట్లాడే మాటలు, చేసే మెసేజ్‌లే కాదు.. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టుపైనా సర్కారు నిఘా పెట్టనున్నది. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరి గురించి, ఎవరికి మద్దతుగా పోస్ట్ చేస్తున్నారో క్షణాల్లో సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలను రూపొందించి చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ అధునాతన సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కులను హరిస్తాయని నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టాక్‌వాకర్: నెటిజన్లపై డిజిటల్ రాడార్
సెలీబ్రైట్ ఇన్సైట్స్: పూర్తయిన కాల్స్‌ను రికార్డ్ చేసే సామర్థ్యం
సైబర్ ఫోరెన్సిక్ హబ్: డిలీటెడ్ ఫైల్స్ రికవరీ.. సీజ్ డేటాను మిర్రర్ కాపీ చేయగల సామర్థ్యం
ఇన్సైట్ టూల్: యూజర్ల యాక్టివిటీ ట్రాక్ చేయడం దీని ప్రత్యేకత
తెలంగాణలో మీరు ఫోన్ మాట్లాడుతున్నారా? ఆండ్రాయిడ్‌తో నడిచే శాంసంగ్, ఐవోఎస్‌తో నడిచే యాపిల్.. మీ ఫోన్ ఏదైనా దానికి చెవులు, భూతద్దాలలాంటి కండ్లు రాబోతున్నాయి. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులతో మాట్లాడే కాల్స్‌ను తెలియకుండా మూడో వ్యక్తి వినబోయే రోజులు రానున్నాయి.
ఒక వ్యాపారి తన కస్టమర్‌తో చేసే సంభాషణను,
ఒక ఉద్యోగి తన బాస్‌తో చెప్పే విషయాలను,
బాస్ ఇచ్చే సూచనలను, వ్యాపార భాగస్వాములు
పంచుకొనే సున్నితమైన సమాచారాన్ని,
ఎడిటర్‌తో జర్నలిస్ట్ చర్చించే అంశాలను,
అధికారుల మధ్య సీక్రెట్‌గా జరగాల్సిన అధికారిక సమాచార మార్పిడిని..
ఇలా మీరు ఫోన్లో చేసే ప్రతి సంభాషణను, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో చేసే చాటింగ్‌లను ఎప్పటికప్పుడు గమనించే కాలం అతి త్వరలో రాబోతున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అంతేకాదు.. మీరు మాట్లాడుతున్న, గతంలో మాట్లాడిన కాల్స్‌ను కూడా రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉన్నది. ఎప్పుడో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు, పోస్ట్‌లను క్షణాల్లో రిట్రైవ్ చేయవచ్చు. మీరు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్‌పై నిఘా ఉండనుంది. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరి గురించి, ఎవరికి మద్ధతుగా పోస్ట్ చేస్తున్నారో క్షణాల్లో సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలు సిద్ధం అవుతాయి. ఇదంతా ఎవరో ప్రైవేట్ వ్యక్తులో, స్పైవేర్ సంస్థలో చేస్తాయనుకుంటే పొరబాటే. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న శక్తివంతమైన టూల్స్ చేయగలిగే పనులు ఇవి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేసే ఈ అధునాతన సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరిపై నిఘా నేత్రంగా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాత.. ‘ప్రతిపక్ష నేతల ప్రతి కదలిక రికార్డ్ అవుతుంది. వారి మద్దతుదారులు, అభిమానులు, అనుకూల వ్యక్తులు నిఘా పరిధిలోకి వస్తారు. అనుమానం ఉన్న స్వపక్షం నేతలపై కూడా అనుక్షణం నిఘా కన్ను ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత గోప్యతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం పొంచి ఉన్నది’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే.. తెలంగాణలో ఇకపై ఏ ఫోన్ కూడా సురక్షితం కాబోదన్నమాట.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం ‘ది తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్’ (టీజీటీఎస్) ఇటీవల టెండర్లను ఆహ్వానించింది. దీని ప్రకారం తెలంగాణ పోలీసులు టాక్ వాకర్, సెలీబ్రైట్ ఇన్సైట్స్ వంటి హై-ఎండ్ టెక్ టూల్స్‌ను కొనుగోలు చేయనున్నారు. సైబర్ నేరాలకు ముకుతాడు వేయడం, శాంతి-భద్రతలను పరిరక్షించడం కోసం వీటిని కొనుగోలు చేస్తున్నామని పైకి చెప్తున్నారు. అయితే.. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ అత్యాధునిక టెక్ టూల్స్‌తో వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం పొంచి ఉన్నదని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలపై, ఆయా పార్టీల మద్దతుదారులపై, లక్షిత పౌరులపై వీటిని ప్రయోగిస్తారన్న అనుమానాలు కలుగుతున్నాయి. టీజీటీఎస్ కొనుగోలు చేయనున్న అడ్వాన్స్డ్ ఏఐ టెక్ టూల్స్‌లో ఉన్న అధునాతన ఫీచర్లతో మనం ఏం చేస్తున్నామోనన్న విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చని, ఎవరితో ఫోన్లో ఏం మాట్లాడాం? ఏం ఛాటింగ్ చేశామన్న విషయాన్ని కూడా పసిగట్టవచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇది ఒకరకంగా ‘మనపై పెట్టిన 24 గంటల నిఘా’ అని అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న టెక్ టూల్స్ ఏమిటి? ఏ టూల్‌తో ఏం జరుగుతుంది? మనకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నది? అనే చర్చ మొదలైంది.
ఇది అత్యంత శక్తివంతమైన ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్, ఐఫోన్లను అన్‌లాక్ చేయడానికి, తొలగించిన డేటాను తిరిగి పొందడానికి, ప్రైవేట్ సమాచారాన్ని విశ్లేషించడానికి దీన్ని వాడతారు. ఏదైనా డిజిటల్ డివైజ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి లాక్ చేసినా, ఇది సులభంగా ఓపెన్ చేయగలదు. పూర్తయిన కాల్స్‌ను రికార్డ్ చేసే సామర్థ్యం ఉన్నది.
1. అన్‌లాక్ ఫోన్స్: పిన్ నంబర్, పాస్వర్డ్, ఫింగర్‌ప్రింట్, వాయిస్ లేదా ఫేస్ రికగ్నిషన్‌తో పనిలేకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇలా ఎలాంటి ఫోన్ లాక్‌నైనా సెకండ్లలో తెరువగలదు.
2. కాల్ రికార్డింగ్స్: లైవ్ కాల్స్‌ను రికార్డ్ చేసే సామర్థ్యం లేకపోయినప్పటికీ, అప్పటికే పూర్తైన కాల్స్‌ను రికార్డ్ చేసి ఏం మాట్లాడుకున్నారో సేవ్ చేయగలదు.
3. ఎక్స్ట్రాక్టెడ్ డిలీటెడ్ డేటా: ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి తొలగించిన ఫొటోలు, వీడియోలు, చాటింగ్‌లు, డాక్యుమెంట్లను మళ్లీ పునరుద్ధరించగలదు.
4. బ్రూట్ ఫోర్స్ అన్‌లాక్: ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో సెకండ్ల వ్యవధిలో పిన్ లేదా పాస్‌వర్డ్‌లను అత్యంత హైస్పీడ్‌తో క్రాక్ చేయగలదు. విండోస్, లైనక్స్, బీఎస్డీతో సెక్యూర్డ్‌గా ఉన్న నెట్‌వర్క్‌లను కూడా సులభంగా ఛేదించగలదు.
5. యాక్సెస్ టు ఎన్క్రిప్టెడ్ డివైజ్: ఐఫోన్, శాంసంగ్ అడ్వాన్స్డ్ మొబైల్స్, ట్యాబ్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేసినా, ఈ టూల్‌ను ఉపయోగించి వాటితో సులభంగా యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
6. క్లౌడ్ డేటా ఎక్స్ట్రాక్షన్: లాగిన్, పాస్వర్డ్ అవసరం లేకుండానే గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్, వాట్సాప్ బ్యాకప్ డేటాలోని క్లౌడ్ సమాచారాన్ని మొత్తం వెలికితీయవచ్చు.
7. సెలక్టివ్ ఎక్స్ట్రాక్షన్: డేటా ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సమాచారం కావాలి? ఏ యాప్ లేదా డివైజ్ నుంచి ఎంత సమాచారం కావాలి? అనే విషయాన్ని సెలక్టివ్‌గా ఎన్నుకొని డిలీట్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ను మళ్లీ వెనక్కి తీసుకొస్తుంది.
8. యాప్ కమాండ్: వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లను కమాండ్ చేయగలదు. వాటిలోని డేటాతోపాటు డిలీట్ చేసిన సమాచారాన్ని మళ్లీ వెలికితీయగలదని నిపుణులు చెప్తున్నారు.
9. హిడెన్ కంటైనర్స్: శాంసంగ్ సెక్యూర్ ఫోల్డర్, హువాయీ ప్రైవేట్ స్పేస్, ఒప్పో, వివో సెకండ్ స్పేస్ వంటి కనిపించని హిడెన్ ఫోల్డర్లలోని సెక్యూర్డ్ ఫైల్స్ డేటాను కూడా రాబట్టగలదు.
10. డిలీటెడ్ డేటా రికవరీ: డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి సాధించగలదు.
11. క్రాస్-డివైజ్ డేటా: ఫొటోలు, వీడియోలను వివిధ బ్యాక్అప్ల నుంచి సేకరించి ఒక నెట్‌వర్క్‌గా అమర్చి.. దేని తర్వాత ఏది చేశారన్న విషయాన్ని తెలుసుకోగలదు. ఫోన్లు, ల్యాప్టాప్స్, సిమ్ కార్డులు, వాట్సాప్, గూగుల్ బ్యాకప్‌లపై దీని పరిధి ఉంటుంది.
కాల్ రికార్డింగ్స్‌తో యూజర్ల ప్రైవేటు విషయాలు బయటకు రావొచ్చు. వారి వ్యక్తిగత డేటా కూడా ప్రమాదంలో పడొచ్చు. ఇతరులకు కనిపించొద్దని హిడెన్ ఫోల్డర్లో దాచిపెట్టిన సమాచారం కూడా బయటపడొచ్చు. మనకు అభ్యంతరకరంగా అనిపించి డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను కూడా తిరిగి రాబట్టగలదు. ఈ ఫొటోలు సైబర్ నేరగాళ్లు, హనీ ట్రాప్ ముఠాల చేతిలో పడితే పరిస్థితి దిగజారొచ్చు. ఈ టూల్‌తో ఒకవిధంగా మన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు భద్రత లేకుండా పోయినట్టే.
దీన్ని సూపర్ సెర్చ్ ఇంజిన్‌గా పిలుస్తారు. డిజిటల్ డిటెక్టివ్ టూల్ అని కూడా అంటారు. సోషల్‌మీడియా, ఆన్లైన్ వేదికల్లో యూజర్ల యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం దీని ప్రత్యేకత. ఎవరు, ఎవరితో ఏం చాటింగ్ చేస్తున్నారన్న వివరాలను నిక్షిప్తం చేస్తుంది.
1. డేటా కలెక్షన్: మనకు తెలియకుండానే వెబ్సైట్లలో మనం నమోదు చేసిన వివరాలు, సోషల్‌మీడియా పోస్టులను కలెక్ట్ చేసి పెద్ద డేటాబేస్‌ను తయారు చేస్తుంది.
2. లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్లేషన్: మనం ఏ భాషలో పోస్ట్ చేసినా.. దేశంలోని అన్ని భాషల్లోకి పర్ఫెక్ట్గా విషయాన్ని తర్జుమా చేయగలదు. ఏఐ, గూగుల్ ట్రాన్స్‌లేట్ కంటే మరింత కచ్చితత్వంతో ఈ ట్రాన్స్లేషన్ ఉంటుంది.
3. ఎనాలిసిస్ ఫీచర్: యూజర్లు ఏ విషయంపై ఎక్కువగా మాట్లాడుకొంటున్నారు? ట్రెండ్ ఎలా ఉందన్న దానిపై 6 నెలల సమాచారాన్ని సెకండ్లలో ఇవ్వగలదు.
4. నెట్వర్క్ అండ్ లింకింగ్: యూజర్ ఏ నాయకుడిని ఫాలో అవుతున్నాడు. పోస్టులను ఎవరికి షేర్ చేస్తున్నాడు. వారి మధ్య సంబంధం ఏంటి? అనే విషయాలపై డేటా నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది.
5. స్క్రాపింగ్ అండ్ కలెక్టింగ్: ఫేక్ ఐడీలతో నిర్ణీత గ్రూప్‌లోకి చొరబడి సమాచారాన్ని తస్కరించగలదు.
6. జియో ట్రాకింగ్: ఫొటోలు, వీడియోలు, పోస్టులను బట్టి ఎక్కడి నుంచి వీటిని పోస్ట్ చేశారో చెప్పేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్, క్రిప్టో ట్రాకింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
7. ఇన్వెస్టిగేషన్ అండ్ డీప్ సెర్చింగ్: ప్రత్యేక కీవర్డ్, హ్యాష్‌ట్యాగ్‌లను ఎందుకు తరుచూ వాడుతున్నారు? అలా వాడితే ఏం ఫలితమొస్తుంది? అనే విషయాలపై విశ్లేషణ చేయగలదు. డీప్ సెర్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.
8. సెక్యూరిటీ అండ్ ఎవిడెన్స్: లీగల్, పొలిటికల్ ప్రయోజనాల కోసం సోషల్‌మీడియా డేటాను వినియోగించగలదు. మరే ఇతర హ్యాకర్లు ఓపెన్ చేయనివిధంగా సెక్యూరిటీ కీని ఏర్పాటుచేసి ఎవిడెన్స్‌లను భద్రపర్చగలదు.
9. రిపోర్ట్స్ అండ్ అవుట్‌పుట్: కోట్లల్లో ఉన్న పోస్టులు, ఫొటోలు, వీడియోల సమాచారాన్ని నిమిషాల వ్యవధిలో విశ్లేషించి ఆటో జనరేటెడ్ సమ్మరీలను, టైమ్‌లైన్‌లను, చార్టులను ప్రిపేర్ చేయగలదు.
మనకు తెలియకుండానే మనం నమోదు చేసిన వివరాలు, సోషల్‌మీడియా పోస్టులను కలెక్ట్ చేయడం, మన లొకేషన్‌ను ట్రాక్ చేయడం చట్టవిరుద్ధం. ఫేక్ ఐడీలతో నిర్ణీత గ్రూప్‌లోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కూడా తప్పే. ఈ టూల్‌తో మన వ్యక్తిగత భద్రతతో పాటు సామాజికంగా కూడా శాంతి-భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది.
ఆధారిత ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్. ఒక వస్తువు గురించి లేదా పార్టీ గురించి లేదా ప్రభుత్వ పాలసీ గురించి సోషల్‌మీడియా వేదికల్లో ఎవరు? ఏం చర్చిస్తున్నారన్న విషయాన్ని సెకండ్ల వ్యవధిలో తెలియజేస్తుంది. ట్రెండింగ్ అంశాలకు స్కోర్ బోర్డును రూపొందిస్తుంది. ఫేక్ న్యూస్‌ను కట్టడి చేస్తుంది. సర్వేలు నిర్వహించి ప్రజల పల్స్‌ను, సెంటిమెంట్‌ను రిపోర్ట్ రూపంలో తయారు చేయగలదు. మొత్తంగా నెటిజన్లపై దీన్ని ఓ డిజిటల్ రాడార్‌గా చెప్పొచ్చు.
1. సోషల్‌మీడియా మానిటరింగ్: ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డిన్, రెడిట్ వంటి సోషల్‌మీడియా వేదికల్లో యూజర్లు ఇచ్చే హ్యాష్‌ట్యాగ్స్, కీవర్డ్లను బట్టి ఏ పోస్ట్ ఏ అంశంపై చేస్తున్నారో కనిపెడుతుంది.
2. మీడియా, వెబ్ మానిటరింగ్: వెబ్‌సైట్స్, బ్లాగ్స్, ఆన్లైన్ ఫోరమ్స్తోపాటు ప్రింట్ మీడియాను స్కాన్ చేసి ఎక్కడ, ఎలాంటి వార్తలు పోస్ట్ అయ్యాయి? ఎవరేం చర్చించారు? అనేదానిపై లోతుగా విశ్లేషించి రిపోర్ట్ తయారు చేయగలదు.
3. మూడ్ చెకర్: సోషల్‌మీడియాలో నెటిజన్లు పోస్ట్ చేసే సానుకూల, ప్రతికూల, తటస్థ పోస్టులను వేరుచేసి ఏ అంశంపై ఏం మాట్లాడారు? అనేదాన్ని విభజించగలదు. ప్రభుత్వానికి అవసరమైన సర్వేలను కూడా నిర్వహించి ప్రజల పల్స్‌ను, సెంటిమెంట్‌ను రిపోర్ట్ రూపంలో తయారు చేయగలదు.
4. ఫొటో, వీడియోల గుర్తింపు: ఆన్లైన్లో ప్రచారమయ్యే ఫొటోలు, వీడియోల్లోని ప్రాంతాలు, గుర్తులు, లోగోలు, నాయకులను సులభంగా గుర్తించగలదు. ఫిల్టర్ చేసే సదుపా యం కూడా ఉన్నది.
5. స్కోర్‌బోర్డ్: సోషల్‌మీడియాలో ఏ అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతున్నది? దేన్ని యూజర్లు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారో విశ్లేషించి దానికి స్కోరింగ్ ఇస్తుంది.
6. ఫేక్ న్యూస్ మానిటరింగ్: ఏఐ ఆధారిత నకిలీ ఫొటోలు, వీడియోలు, వార్తలను గుర్తించి అలర్ట్ చేయగలదు. విపత్తు సంక్షోభ సమయాల్లో నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయగలదు.
సోషల్‌మీడియాలో మనకు నచ్చిన నాయకుడు, పార్టీ, నటుడు లేదా ఏదైనా అంశానికి సంబంధించి మనం ఏదైనా పోస్ట్, వీడియో అప్లోడ్ చేస్తే.. కీవర్డ్స్, హ్యాష్‌ట్యాగ్ సాయంతో ఈ టూల్ వాటిని సులభంగా గుర్తించగలదు. తమ ప్రత్యర్థులకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారితే, ఈ టూల్‌ను ఉపయోగించే వ్యక్తులు వాటిని గుర్తించడంతోపాటు, కట్టడి చేయవచ్చు కూడా. అలాగే, వ్యక్తుల అభిరుచులకు, భావ వ్యక్తీకరణకు పరిమితులు విధించవచ్చు. ఈ టూల్‌ను ఒకరకంగా సోషల్‌మీడియాపై డిజిటల్ రాడార్‌గా చెప్పొచ్చు.
ఇది కూడా అత్యంత శక్తిమంతమైన డిజిటల్ ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్. ఇందులో ఎక్స్టెరో ఎఫ్‌టీకే, ఆటోస్పై, సాన్షిఫ్ట్ తదితర ప్రత్యేక టూల్స్ ఉన్నాయి. ఫోన్లు, కంప్యూటర్లు, యూఎస్బీలు, మొబైల్ బ్యాకప్స్, ఆన్లైన్ డేటాను మానిటరింగ్ చేస్తూనే విశ్లేషించడానికి దీన్ని వాడతారు. డిలీటెడ్ ఫైల్స్‌ను రికవరీ చేయగలదు. సీజ్ చేసిన డేటాను కూడా మిర్రర్ కాపీ చేయగల సామర్థ్యం దీనికి ఉన్నది. ఎవరు, ఎవరిని, ఎక్కడ కలిశారన్న ట్రాకింగ్ కూడా చేయగలదు.
1. ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ఎనీ స్టోరేజ్: హార్డ్ డిస్క్, ఎస్ఎస్డీ, యూఎస్బీ, మెమొరీ కార్డుల్లో లాక్ అయిన డేటాను సులభంగా బయటకు రాబట్టగలదు.
2. రికవర్ డిలీటెడ్ ఫైల్స్: ఫార్మెట్ చేసిన డాక్యుమెంట్లు, వీడియోలు, ఫొటోలను తిరిగి పునరుద్ధరించగలదు.
3. ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ఎవిడెన్స్: సీజ్ చేసిన డివైజ్‌లోని డేటాను ఉన్నదిఉన్నట్టు తిరిగి సృష్టించగలదు. బ్రౌజర్ హిస్టరీని ట్రాక్ చేయగలదు.
4. కంటెంట్ డిటెక్ట్: లక్షిత కంటెంట్‌ను ఆటోమెటిక్‌గా గుర్తించగలదు.
5. అడ్వాన్స్డ్ సెర్చింగ్: కోట్లల్లో ఉన్న పోస్టుల సమాచారాన్ని కూడా పేర్లు, కీవర్డ్స్, భాషను బట్టి సెకండ్లలో వడబోయగలదు.
6. రిమోట్ యాక్సెస్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ఉన్న డివైజ్లతో అనుసంధానించుకొని డేటాను షేర్ చేసుకోగలదు. ఎవరు, ఎవరిని, ఎక్కడ కలిశారన్న ట్రాకింగ్ కూడా చేయగలదు.
7. ఏఐ సెంటిమెంట్ ఎనాలిసిస్: ఏఐ ఆధారిత ఫొటోలు, వీడియోలను అనుసరించి ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తించగలదు.
లాక్ చేసిన మెమొరీ కార్డులతో పాటు డిలీటెడ్ ఫైల్స్‌ను కూడా తిరిగి రాబట్టే సామర్థ్యం ఉండటంతో ప్రైవేట్, కీలక వ్యక్తిగత సమాచా రం బయటకు రావొచ్చు. కాపీ ఆఫ్ ఎవిడెన్స్ ఫీచర్‌తో మన ఫోన్లోని సమాచారాన్ని ఇంకో ఫోన్లో రీకాపీ చేస్తే అది దుర్వినియోగం అ య్యే ప్రమాదం ఉంది. మనం ఎవరిని, ఎక్కడ కలుస్తున్నామో ట్రాక్ చేయడమంటే మన గోప్యతాహక్కును కాలరాయడమే అవుతుంది.