హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇసుక ధర నెలనెలా పెరుగుతూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలు దిగిరావడం లేదు. ప్రభుత్వ తప్పిదాలకు భారీ వర్షాలు తోడవడంతో టన్ను ఇసుక ధర రూ.2,700లకు చేరింది. దీంతో నిర్మాణరంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నది. గతంలో టన్ను ఇసుక రూ. 1,200-1,400 విరివిగా లభించేది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టి ఇసుక తవ్వకాలు, రవాణాపై అనేక ఆంక్షలు విధించింది. దీంతో గతంలో ఒక్కో లారీ నెలకు 12లోడ్ల ఇసుకను హైదరాబాద్‌కు రవాణా చేయగా, ఇప్పుడు వారానికి ఒక్క లోడు రవాణా చేయడమే గగనంగా మారింది.
ఇసుక రీచ్‌ల వద్ద వసూళ్లు ఒక ఎత్తైతే, తనిఖీల పేరుతో జాప్యం మరో ఎత్తు. దీంతో ఇసుక లారీలు రీచ్‌ల వద్దే మూడు, నాలుగు రోజులు ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇసుక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ నాసిరకం ఇసుక లభిస్తుండడంతో కొనుగోలు చేసేందుకు నిర్మాణదారులు వెనకాడుతున్నారు. అంతేకాదు, ఇసుక ధరను ప్రభుత్వమే అధికారికంగా టన్నుకు రూ.1,800 నిర్ణయించడంతో బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్‌కు ఇసుక రవాణా స్తంభించిపోయింది. నగరంలోని ఇసుక అడ్డాల వద్ద గతంలో పెద్దసంఖ్యలో ఇసుక లారీలు ఉంటుండగా, ఇప్పుడు ఒకటి, రెండు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పెరిగిన ఇసుక ధర నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలు నిర్మాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇసుక ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. డిమాండ్, సప్లయ్ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వానకాలంలో కొరత లేకుండా గతంలో స్టాక్‌యార్డుల్లో ఇసుకను నిల్వచేసేవారు. కానీ, ఇటీవలికాలంలో ఆ ఆనవాయితీని నిలిపివేయడంతో మార్కెట్లో ఇసుక లభించడంలేదు. కనీసం ఇసుక బజార్లలోనైనా నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉందా? అంటే అదీ లేదు. రీచ్‌ల వద్ద ప్రభుత్వం రూ.400చొప్పున టన్ను ఇసుక ఇస్తున్నది. ఈ సంక్షోభం తీరేవరకు ఉచితంగా ఇసుక అందిస్తే మార్కెట్లో కొంతవరకైనా ధర దిగివస్తుందని నిర్మాణదారులు, లారీ యజమానులు అభిప్రాయపడుతున్నారు.
నర్సింహులపేట, అక్టోబర్ 8 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఫకీరతండా శివారు ఆకేరువాగులో ఇసుక జాతర సాగుతున్నది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పేరుతో అక్రమంగా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో అనుమతులు ఇస్తే వందల ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని, అనుమతుల వారీగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహబూబాబాద్, చిన్నగూడూరుకు చెందిన ట్రాక్టర్లకు సంబంధించి రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి అన్నీ తానై డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వాగును నమ్ముకుని మోటర్ ఏర్పాటు చేసుకుంటే వైర్లు తెగిపోవడంతోపాటు పైపులు పగిలిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.