‘దేవుడా… చెరువు చేపలతో నిండినట్లు ఈ నగరం జనంతో నిండాలి’ అంటూ హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన సందర్భంగా కులీ కుతుబ్‌షా చేసిన ప్రార్థన ఫలించింది. హైదరాబాద్ మహా నగరమైంది. మినీ భారతంగా మారింది. ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంది. నీడనిచ్చింది! కడుపు నింపింది!! కానీ శతాబ్దాల ఖ్యాతి వందరోజుల్లో తలకిందులైంది. హైడ్రా మొదలైంది. బుల్డోజర్లు ఇండ్లు కూలుస్తుంటే సామా న్యులెందరికో హైదరాబాద్ ఇప్పుడో అభద్ర నగరిగా మారింది.
HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగరంలో రాత్రికి రాత్రి కుటుంబాలు వీధినపడటం అనేది చరిత్రలో ఇదే తొలిసారి. అందుకు కారణం.. హైడ్రా! హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా) పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థ సృష్టించిన విధ్వంసంతో ఇప్పటికీ సగటు నగరవాసికి కంటిమీద కునుకు కరువైంది. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ (సింహభాగం), టీడీపీ పాలనలో నగరంలోని చెరువుల గొంతు నులిమి… ఇప్పుడు చెరువుల పరిరక్షణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన హైడ్రామాకు వంద రోజులు నిండాయి. హైడ్రాను ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కారు ఈ ఏడాది జూలై 19న జీవో 99 జారీ చేసింది. అప్పటి నుంచి ఆ సంస్థ వందలాది నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినదేమిటి? ఈ సంస్థ ఏర్పాటు వెనుక మర్మమేమిటి?
నిజాం కాలం నుంచి 90వ దశకం వరకు నగరంలో సుమారు 4వేలకుపైగా చెరువులు, కుంటలు, వాగులు, నాలాలు, మెట్ల, చేద బావులు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. 1956 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత క్రమేణా అవి కాలగర్భంలో కలుస్తూవస్తున్నాయి. 1996లో నిర్వహించిన సర్వేలో ఏకంగా 3వేల వరకు నీటి వనరులు కనుమరుగైనట్టుగా తేలింది. శాటిలైట్ ఛాయాచిత్రాలతో చేసిన ఈ సర్వేలో 1004 నీటి వనరులు మాత్రమే ఉన్నట్టు నివేదికలో స్పష్టం చేశారు. పది హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని చెరువులు 169 మాత్రమేనని వెల్లడైంది. 2000 సంవత్సరంలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడంతో చంద్రబాబు ప్రభుత్వం కిర్లోస్కర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం నగరంలో 1500 నాలాలు కబ్జాకు గురైనట్టుగా తేల్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి నగరంలోని 64 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ను నిర్ధారించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి చెరువుల పరిరక్షణకు మొదటి అడుగుగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఏర్పాటు జీవో రాకముందే కూల్చివేతల పర్వాన్ని ప్రారంభించారు. తుపాకీని తొలుత రాజకీయంగా ఎక్కుపెట్టి.. ఆపై అనేక అయోమయాల మధ్య సామాన్యుడి మీద తూటాల వర్షం కురిపించారు. అవుటర్ రింగు రోడ్డు వరకు పరిధి అని అమలులోకి వచ్చిన హైడ్రా ఇప్పటివరు 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలకే రూ.10-15 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. ఈ కూల్చివేతల్లో అత్యధికంగా గాజుల రామారంలోని చింతల్చెరువుల ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. రాజేంద్రనగర్‌లోని భూమురక్డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇదే క్రమంలో లోటస్‌పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బాచుపల్లి, చందానగర్, అమీర్‌పేట, అమీన్పూర్, గుట్టల బేగంపేట, మల్లంపేటలలో పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. కత్వా చెరువు పరిధిలోని నిర్మాణాలను ఏకధాటిగా 17 గంటల పాటు కూల్చివేశారు.
హైడ్రా కూల్చివేతల్లో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్‌కు చెందిన ఏరో స్పోర్ట్స్ నిర్మాణాలను కూల్చివేశారు. మాదాపూర్‌లో సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు. ఇక జాబితాలో ప్రధానమైన వాళ్లలో కావేరీ సీడ్స్ అధినేత జీవీ భాస్కర్‌రావుకు చెందిన నిర్మాణం ఉంది. ఇది హైడ్రా పరిధి కాకపోయినా కూల్చివేతలు చేపట్టడం వెనక ఆంతర్యమేమిటో ఇప్పటికీ అటు ప్రభుత్వం, ఇటు హైడ్రా స్పష్టం చేయలేదు. అమీన్పూర్లో విల్లాలు అని పేరేగానీ అవి సాధారణ నిర్మాణాలే. సున్నం చెరువులో అత్యంత నిరుపేదల నివాసాలను కూల్చివేయడంతో ఇప్పటికీ వాళ్లు శిథిలాల మధ్యనే కాలం గడుపుతున్నారు. తాత్కాలిక గుడిసెలు వేసుకుని రోడ్డుపక్కన జీవిస్తున్నా… అది కూడా ఖాళీ చేయాలని హైడ్రా హుకూం జారీ చేసింది.
అనుమతులుంటే కూల్చివేయమని చావు కబురు చల్లగా చెప్పినట్లు… ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, అదేరోజు పత్రికా ప్రకటనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెలవిచ్చారు. కానీ ఇప్పటికే కూల్చివేసిన వాటిలో అనుమతులున్న నిర్మాణాల నేలమట్టానికి బాధ్యులెవరు? అనేది రేవంత్ సర్కారు చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్ హఫీజ్‌పేట డివిజన్ మదీనాగూడలోని సర్వేనెంబర్ 26లో ఈర్లచెరువు బఫర్‌జోన్‌లో ఉన్నారని ఆగస్ట్ 19న మూడు భవనాలను కూల్చేశారు. వాస్తవానికి ఇది హెచ్ఎండీఏ లేఅవుట్. అంటే ప్రభుత్వమే బాజాప్తా అనుమతి ఇచ్చిన లేఅవుట్. పైగా ఆ నిర్మాణాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. కానీ హైడ్రా నిర్ధాక్షిణ్యంగా ఆ నిర్మాణాలను కూల్చివేసింది. ఇదేమంటే… ఆ మూడు నిర్మాణాలపై మాత్రమే ఫిర్యాదులు వచ్చాయన్నది. హెచ్ఎండీఏ లేఅవుట్లో కూల్చివేయడమే ఒక తప్పయితే… మూడింటిని మాత్రమే కూల్చేయడమంటే అది ఆటవిక న్యాయంగాక మరేమవుతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీలు, వాటర్‌బాడీలు, పబ్లిక్ ప్లేసెస్, పార్కులు తదితర ప్రభుత్వ, జీహెచ్ఎంసీ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా రక్షించడానికి ప్రభుత్వం హైడ్రాకు అధికారం కల్పించింది. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులివ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374బీని హైడ్రా అధికారాలుగా చేరుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌కు పొడిగింపుగా ఈ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. తద్వారా హైడ్రాకు విశేష అధికారాలు వచ్చాయని కమిషనర్ రంగనాథ్ ఆ సమయంలో ప్రకటించారు. తద్వారా ప్రభుత్వం జీహెచ్ఎంసీని నిర్వీర్యం చేసింది.
హైడ్రా ఏర్పాటైన తర్వాత చట్టబద్దత కల్పించేందుకు రెండు నెలలకు పైగా సమయం పట్టింది. దీంతో ఆయా స్థానిక సంస్థలు నోటీసులు జారీ చేస్తే హైడ్రా కూల్చివేతలకు పాల్పడింది. ఈ క్రమంలో మూడు నెలల కాలంలో నీటిపారుదల, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ విభాగాలు వందలకొద్దీ నోటీసులు జారీ చేశారు. ఇందులో అత్యంత కీలకమైన నిర్మాణ సంస్థలు ఉన్నాయి. వేలాది ఫ్లాట్లు ఉన్న ఆకాశహర్మ్యాలు ఉన్నాయి. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నట్టుగా గుర్తించారు. స్థానిక సంస్థల ద్వారా నోటీసులు కూడా జారీ చేయించారు. ఈ క్రమంలో పేదోళ్లపైనే జులుం.. పెద్దల అక్రమాలపై ఉండదా? ప్రశ్నలు వచ్చినపుడు ‘ఇక చూస్తారుగా! భారీ ప్రాజెక్టుల భరతం పడతాం!’ అనే రీతిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన మాటలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు జోలికి వెళ్లింది లేదు… ఒక్క ఇటుకనూ కదిలించింది లేదు. వారం, పదిహేను రోజుల గడువు దాటి నెల, రెండు నెలలు గడుస్తున్నా బుల్డోజర్లు ఆ ప్రాజెక్టుల వద్దకు ఎందుకు పోవడం లేదు? నోటీసుల బెదిరింపుల తర్వాత చోటుచేసుకున్న ‘సంతృప్తి’కర పరిణామాలేంది? ముఖ్యంగా బడా ప్రాజెక్టుల భరతం పడతామన్న హైడ్రా అడుగులు కొన్నిరోజులుగా చెరువుల సుందరీకరణ.. డిజాస్టర్ మేనేజ్మెంట్.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ… వృక్షాల పరిరక్షణ.. ఇలా వివిధ రకాల రూపాలను ఎందుకు సంతరించుకుంటున్నది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌కు నీటిపారుదల శాఖ నోటీసులు ఇస్తే హైడ్రా కూల్చేసింది. దుర్గం చెరువు, సున్నం చెరువు, పరిధిలో రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది. హస్మత్‌పేట పరిధిలో నీటిపారుదల శాఖ నోటీసులు ఇచ్చింది. కూకట్పల్లి నల్లచెరువు పరిధిలో జీహెచ్ఎంసీ ఇచ్చింది. వీటిల్లో సున్నం చెరువు, నల్లచెరువు పరిధిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కానీ దుర్గం చెరువు పరిధిలో నెల రోజుల గడువు ఇచ్చి… నెలన్నర వరకు అటు రెవెన్యూ, ఇటు హైడ్రా కన్నెత్తి చూడలేదు. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి నివాసం కూడా ఉంది. దానికి కూడా నోటీసు ఇచ్చారు. అందుకే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే దాకా అందరూ మౌనం వహించారు.
అప్పటికే నివాసం ఉంటే ఆ నిర్మాణాల జోలికి వెళ్లమని సాక్షాత్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెలవిచ్చారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు, మల్లంపేట పరిధిలోని కత్వా చెరువు పరిధిలో అప్పటికే నివాసం ఉంటున్నప్పటికీ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూల్చివేతలు చేపట్టారు. ఇదేమంటే… సున్నం చెరువు పరిధిలో వారు వ్యాపారం చేస్తున్నారట… కత్వా చెరువు పరిధిలో రాత్రికి రాత్రి గృహ ప్రవేశాలు చేశారట. సంగారెడ్డి పరిధిలోని అమీన్పూర్, కిష్టారెడ్డిపేటల్లో కూడా ఏండ్ల కిందటి నుంచి నివాసం ఉంటున్న వాళ్లు ఉన్నారు. అయినా వారి ఇండ్లను కూల్చివేశారు. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యాసంస్థలపైనా హైడ్రా గురి పెట్టింది. అనూహ్యంగా తెరపైకి ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ వచ్చిపడింది. దీంతో హైడ్రా మౌనం వహించాల్సి వచ్చింది.
రేవంత్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99లో హైడ్రా పరిధితో పాటు చైర్మన్‌గా వ్యవహరించే సీఎం సహా 12 మంది పాలకమండలిని స్పష్టంగా పేర్కొన్నారు. ఇందు లో డిప్యూటీ సీఎం పేరు లేదు. కానీ కొన్నిరోజులుగా భట్టి విక్రమార్క చెరువులతో పాటు హైడ్రా అంశాలపై ప్రత్యేక దృష్టిసారించడం చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల కిందట హైడ్రా కమిషనర్ రంగనాథ్ భట్టిని కలవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. మేడ్చల్ జిల్లా పరిధిలో 20 చెరువుల సర్వే పూర్తి కావడంతో ఆ వివరాలను రంగనాథ్ డిప్యూటీ సీఎంకు వివరించినట్టు తెలిసింది. దీంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజెంటేషన్‌లోని కొన్ని చెరువుల వివరాలను కూడా భట్టి ముందు ఉంచినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇవి కాదు.. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులన్నింటినీ సర్వే చేయాలని నిర్ణయించినందున ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూల్చివేతల జోలికి వెళ్లొద్దని ఆదేశించినట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి… సీఎం చైర్మన్‌గా ఉండే హైడ్రా డిప్యూటీ సీఎంకు ఎందుకు రిపోర్ట్ చేస్తుందనేదే ఇప్పుడు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రాతో తెలంగాణ రియల్-నిర్మాణ రంగం కుదేలవడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం నష్టనివారణ చర్యలు చేపట్టిందనేది రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ. ఇక నుంచి హైడ్రా వ్యవహారాన్ని చూసుకోవాల్సిందిగా అధిష్ఠానం భట్టికి సూచించడంతోనే కమిషనర్ రంగనాథ్ తరచూ ఆయనతోనే సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.