హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పార్ట్ టైం టీచర్లు డిమాండ్ చేశారు. విధుల్లో నుంచి తొలగించినందకు నిరసనగా 25న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్ట్ టైం టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్, లైబ్రేరియన్, పీఈటీ, అసిస్టెంట్ కేర్ టేకర్ తదితర పోస్టుల్లో 10 ఏండ్లుగా పార్ట్‌టైం పద్ధతిలో పనిచేస్తున్నామని వివరించారు.
సొసైటీ ఉత్తమ ఫలితాలను సాధించడంలో కృషి చేశామని తెలిపారు. కానీ బీసీ, ఎస్టీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీల్లో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ సొసైటీలోనే 1274 జీవో పేరిట తమను తొలగించారని వాపోయారు. సొసైటీ తమకు నచ్చినవారిని, కనీస అర్హతలు, బోధనానుభవం లేని కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటున్నదని వెల్లడించారు. కొత్తవారిని కాకుండా.. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బుధవారం ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ పార్ట్ టైం టీచర్లు వెల్లడించారు.