సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 10:14:17

కుటుంబ పోష‌ణ కోసం ఈత క‌ల్లు గీస్తున్న సావిత్రి

కుటుంబ పోష‌ణ కోసం ఈత క‌ల్లు గీస్తున్న సావిత్రి

మెద‌క్ : ఆమె మ‌గాళ్ల‌కు ఏం తీసిపోదు.. బాణాల్లాంటి ముళ్ల‌కు బెద‌ర‌కుండా.. ఈత చెట్లెక్కి క‌ల్లు గీస్తున్న‌ది. కల్లు గీయ‌క‌పోతే ఆమె ఇల్లు గ‌డ‌వ‌దు.. క‌డుపు నిండ‌దు. పొట్ట‌కూటి కోసం కోటి విద్య‌లు అన్న‌ట్టు.. త‌న జీవ‌నోపాధి కోసం ఈత చెట్ల‌ను ఎక్కి క‌ల్లు గీయ‌డం త‌న దిన‌చ‌ర్య‌గా మార్చుకుంది. ఓ మ‌హిళ క‌ల్లు గీయ‌డం ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో ఈమెనే తొలి మ‌హిళ‌. రాష్ర్టంలో కూడా ఈమెనే అయి ఉండొచ్చు. 

నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లం రేగోడ్ గ్రామానికి చెందిన పుర్ర సావిత్రి(25) భ‌ర్త కొన్ని నెల‌ల క్రితం చనిపోయాడు. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత కుటుంబాన్ని పోషించ‌డం సావిత్రికి భారంగా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు మామ‌ను పోషించ‌డం క‌ష్టమైంది. చేసేదేమీ లేక త‌న భ‌ర్త వృత్తిని ఆమె ఎంచుకుంది. క‌డుపు నింపుకునేందుకు క‌ల్లు గీయ‌డం మొద‌లెట్టింది. మొద‌ట్లో చిన్న చిన్న ఈత చెట్ల‌ను ఎక్క‌డం ప్రారంభించిన సావిత్రి.. ప్ర‌స్తుతం పెద్ద పెద్ద చెట్ల‌ను ఎక్కి క‌ల్లు గీస్తుంది. 

8 కిలోమీట‌ర్లు.. 50 లీట‌ర్ల క‌ల్లు

సావిత్రి పొద్దున్నే 5 గంట‌ల‌కు లేచి 8 కిలోమీట‌ర్లు న‌డ‌క సాగిస్తోంది. ఆ త‌ర్వాత ఈదుళ్ల‌కు చేరుకుని రోజుకు 50 లీట‌ర్ల క‌ల్లు సేక‌రిస్తుంది. త‌ర్వాత మ‌ళ్లీ చెట్ల‌కు లొట్ల‌ను క‌ట్టి సేక‌రించిన క‌ల్లు తీసుకుని రోడ్డుపైకి వ‌స్తోంది. ర‌హ‌దారి గుండా పోయే వారితో పాటు స‌మీప గ్రామాల ప్ర‌జ‌లకు క‌ల్లును అమ్మి రోజుకు రూ. 400 వ‌ర‌కు సంపాదిస్తోంది. ఆ డ‌బ్బుతో జీవ‌నం కొన‌సాగిస్తోంది. 

కూతురికి ప‌క్ష‌వాతం

సావిత్రి కూతురుకు ప‌క్ష‌వాతం వ‌చ్చింది. ఆ చిన్నారి మంచానికే ప‌రిమిత‌మైంది. పాప‌కు తోడు మామ కూడా అనారోగ్యానికి గుర‌య్యాడు. దీంతో వీరిద్ద‌రికి నెల‌కు రూ. 6 వేల చొప్పున మెడిసిన్స్ కోసం ఖ‌ర్చు చేస్తోంది సావిత్రి. 

అల‌సిపోతాను.. అయినా త‌ప్ప‌దు..

ప్ర‌తి రోజు ఈత చెట్లు ఎక్క‌డంతో అల‌సిపోతుంటాను. కండ‌రాల్లో నొప్పి వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ త‌న ప‌నికి విరామం చెప్ప‌కుండా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాను. జీవ‌నం కొన‌సాగించేందుకు త‌న‌కు మ‌రో మార్గం లేద‌ని సావిత్రి స్ప‌ష్టం చేసింది. తాను ఇలా క‌ల్లు గీస్తున్నందుకు కొంద‌రు త‌న‌తో మాట్లాడ‌టం మానేశార‌ని వాపోయింది. ఇటీవ‌లే త‌న‌కు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ టీఎఫ్‌టీ(ట్రీ ఫ‌ర్ ట్యాప‌ర్స్‌) లైసెన్స్ మంజూరు చేసిందని తెలిపింది. ఈ లైసెన్స్ వ‌ల్ల తాను రోజుకు 30 చెట్ల నుంచి క‌ల్లు తీసుకునే అనుమ‌తి ల‌భించింద‌ని సావిత్రి పేర్కొంది.


logo