హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు పేరెత్తితే చాలు రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన సంఘాలు గుర్రుమంటున్నాయి. చేవేళ్ల డిక్లరేషన్ పేరిట గిరిజన సమాజాన్ని హస్తం పార్టీ దగా చేసిందని నిప్పులు చెరుగుతున్నాయి. హామీల అమలు సంగతేమో కానీ ఉన్నవాటినీ అటకెక్కిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హస్తంపార్టీపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు సన్నమద్ధయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనులకు కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చింది. వాటిని చేవేళ్ల డిక్లరేషన్‌గా ప్రకటించింది. ఆదివాసీ గూడాలను, లంబాడీ తండాలను ప్రత్యేక పంచాయతీలుగా, రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని, రాష్ట్ర బడ్జెట్లో బంజారాలకు, ఆదివాసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, గూడేలు, తండా డెవలప్మెంట్కు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపించింది. అంబేద్కర్ అభయ హస్తం కింద జీవనోపాధి కోసం ఆదివాసీ, గిరిజనులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని నమ్మబలికింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎస్టీలకు స్థలం ఇవ్వడంతోపాటుగా, రూ. 6 లక్షల ఆర్థిక
సాయం అందిస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో 12 శాతం కేటాయిస్తామని, ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్, ఎస్టీ విద్యార్థులు పది పాసయితే రూ. 10 వేలు, ఇంటర్ పూర్తిచేస్తే 15 వేలు, డిగ్రీ పూర్తిచేస్తే రూ. 25 వేలు, పీజీ పూర్తిచేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని హామీలతో ఊదరగొట్టింది. కానీ 20 నెలలైనా ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు.
ఉన్న పథకాలకూ మంగళం
ఇచ్చిన హామీ సంగతేమో కానీ ఉన్నవాటికీ కాంగ్రెస్ సర్కారు మంగళం పాడుతున్నది. అందుకు ట్రైకార్ నిదర్శనంగా నిలుస్తుంది. గిరిజనులకు స్వయం ఉపాధి కోసం ట్రైకార్ ద్వారా రుణాలను పంపిణీ చేస్తారు. కానీ కాంగ్రెస్ సర్కారు దీనిని పూర్తిగా నిలిపేసింది. రాజీవ్ యువ వికాసం పథకం అంటూ ఉన్న ట్రైకార్‌ను నిర్వీర్యం చేసేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరాల్లో గిరిజన యువతీయువకుల నుంచి సబ్సిడీ రుణాల మంజూరుకు దరఖాస్తులను స్వీకరించింది. అందులో 30 వేలని లబ్ధిదారులుగా గుర్తించిందని, వారికి అందించేందుకు 219 కోట్ల చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిందని వెల్లడించారు.
ఆదివాసీ, గిరిజన సంఘాల ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆదివాసీ, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం 3000 వేలకు పైగా నూతన గిరిజన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిందని, జనాభా దామాషా ప్రకారం 6 శాతంగా ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించారని, అందుకు ఏటా రూ. కోటి నిధులను కేటాయించారని గుర్తుచేస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున సేవాలాల్ మహారాజ్ పేరు మీద బంజారా భవన్ ఎకరా స్థలంలో రూ.50 కోట్లతో నిర్మించి లంబాడీల ఆత్మగౌరాన్ని నిలిపారని, లంబాడీల భాష గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్చడం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం సహా ఎన్నో సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించింది. కానీ కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా అవమానాలకు గురిచేయడంపై భగ్గుమంటున్నాయి. పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బంజారాహిల్స్‌లోని కుమ్రంభీ ఆదివాసీ భవన్లో శనివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. వేడుకల్లో ఆదివాసీల హకులు -భవిష్యత్తు నిర్మాణం – కృత్రిమ మేధస్సు సాంకేతికతలో వారి పాత్ర’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
గిరిపుత్రులపై అడుగడుగునా ఉక్కుపాదం
పథకాల అమలు సంగతేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిపుత్రులపై ఉక్కుపాదం మోపుతున్నది. ఆదివాసీలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తామని, ప్రభుత్వ అవసరాలకు భూమిని సేకరిస్తే పట్టా భూములకు సమానంగా పరిహారం చెల్లిస్తామని నమ్మబలికిన హస్తం పార్టీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా ముందుగా లంబాడీలు, ఆదివాసీల భూములను గుంజుకోవడం పరిపాటిగా మారింది. అందుకు లగచర్ల నిలువెత్తు నిదర్శనం. అంతేకాదు ఆదివాసీలకు మరో ముప్పును తెచ్చిపెట్టింది. కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట జీవో 49ను తీసువచ్చింది. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పెసా చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, ఆదివాసీల హకులను కాలరాస్తూ ఎలాంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే జీవో 49ను తీసుకువచ్చింది. ఆదివాసీలు వ్యతిరేకించడంతో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఆ జీవో అమలును నిలిపివేసిందే తప్ప ఇప్పటికీ రద్దు చేయలేదు.