Singareni | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బొగ్గు పేరెత్తగానే సింగరేణియే గుర్తుకొస్తుంది. నల్లబంగారానికి సింగరేణి పర్యాయపదమైంది. అంతలా ప్రసిద్ధి పొందిన సింగరేణి.. ఆవిర్భవించి నేటికి 104 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సింగరేణి వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కొత్తగూడెంలో నిర్వహించనున్న వేడుకల్లో సంస్థ సీఎండీ బలరాం పాల్గొననున్నారు. బొగ్గు వెలికితీతే ప్రధాన బాధ్యతగా ఆవిర్బవించిన సింగరేణి వ్యాపార విస్తరణ, తదితర అనేక రంగాల్లోనూ పయనిస్తున్నది.
కొత్త గనులనూ చేపట్టనున్నది. ఒడిశా నైనీ కోల్‌బ్లాక్, కొత్తగూడెంలో వీకే ఓసీ, ఇల్లందులో రొంపేడు ఓసీ, గోలేటి ఓసీల్లో ఉత్పత్తిని ప్రారంభించనున్నది. కొత్తగూడెంలో వెంకటేశ్ ఖని, ఇల్లందులో జవహర్‌ఖని గనులకు అనుమతలు పొందింది. రామగుండంలో 500 మోగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్‌ను నెలకొల్పనున్నది. ఇటీవలే కార్బన్డయాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి సంకల్పించింది.
లిథియం సహా ఇతర ఖనిజాల తవ్వకాలపైనా సింగరేణి దృష్టిపెట్టింది. జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, అమ్మెనియం నైట్రేట్ తయారీకి చర్యలు చేపట్టింది. టీజీ జెన్కోతో కలిసి రామగుండంలో కొత్త థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌ను నిర్మించనున్నది. రాజస్థాన్‌లో సోలార్ ప్లాంట్‌ను నిర్మించనుంది. ఇంతటి ఘనకీర్తిని కలిగిన సింగరేణిని పలు సమస్యలు వెన్నాడుతున్నాయి.