Buddha jayanti | నందికొండ, మే 4 : నల్లగొండ జిల్లా నందికొండలోని బౌద్ధ వారసత్వ థీమ్ పార్కు బుద్ధవనంలో శుక్రవారం బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ వేడుకలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొననున్నట్టు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నుంచి నందికొండలోని బుద్ధవనం వరకు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో 200 కార్లతో నిర్వహించే ర్యాలీని ఉదయం 7.45 గంటలకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ ప్రారంభిస్తారని తెలిపారు.
ఉదయం 10 గంటలకు బుద్ధచరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద మహాబోధి బుద్ధవిహార సికింద్రాబాద్, సెరా బౌద్ధారామం మైసూర్ బౌద్ధ భిక్షువులతో ప్రార్థనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సా యంత్రం 5 గంటలకు బుద్ధపాదాలు, మహా స్తూపంలో బౌద్ధ భిక్షువులతో ప్రార్థనలు నిర్వహిస్తామని, అనంతరం విద్యుత్తు దీపాలంకరణతో జయంతి వేడుకలు ముగిస్తాయని ఆయన తెలిపారు.