స్టేషన్ ఘన్పూర్, మే 17: పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాలంటూ శనివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లులో రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్-హైదరాబాద్ హైవేపై పొగాకుకు నిప్పంటించి నిరసన తెలిపారు. రైతులు మా ట్లాడుతూ తాము సాగు చేసిన పొగాకును డెక్కన్, వీఎస్టీ కంపెనీలు కొనుగోలు చే యాల్సి ఉన్నదని తెలిపారు. చాగల్లులో 400 మంది రైతులు పొగాకు సాగు చేశారని, ఒక్కో రైతుకు 10 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు.
ఎకరాకు రూ.18 వేల వరకు ధర వస్తుందని వీఎస్టీ కంపెనీకి చెందిన వ్యక్తి నమ్మించడంతో పెద్ద ఎత్తున సాగు చేసినట్టు తెలిపారు. ఒక్కో రైతు వద్ద 10 నుంచి 12 క్వింటాళ్ల పొగాకు ఉన్నదని, దీనిని వీఎస్టీ, డెక్కన్ కంపెనీలు కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరానికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేసినా కొనేవారు లేక నష్టపోతున్నామని రైతు ఆకుల నర్సింగం మండిపడ్డారు. మార్చిలోనే కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా పూర్తికాలేదని అకాల వర్షాలతో నష్టపోతున్నామని వాపోయాడు.