హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ‘ఇల్లు కట్టుకుందాం.. పిల్లల పెండ్లి చేద్దాం.. అప్పులు తీర్చుకుందాం.. ప్రశాంతంగా ఉందాం..!’- ఇదీ రిటైర్మెంట్ అయ్యే సగటు ఉద్యోగి ఆలోచన. అవసరాలకు అక్కరకొస్తాయనుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని ద్రాక్షగా మారాయి. దీంతో విరమణ ఉద్యోగులు మానసికంగా, ఆర్థికంగా నలిగిపోతున్నారు. చేసేదిలేక న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికిపైగా రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు కోర్టు మెట్లెక్కారు. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించక పోవడంపై ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలేసినా రాష్ట్రప్రభుత్వం తీరు మారడం లేదు. సిద్దిపేట జిల్లా మందపల్లి జెడ్పీ పాఠశాలలో పదవీ విరమణ పొందిన గెజిటెడ్ హెచ్ఎం బీ వెంకటేశం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. టోకెన్లు జారీ అయినా బిల్లులు మంజూరుకాకపోవడంతో ఆయన కోర్టు మెట్లెక్కారు.
గ్రాట్యుటీ రూ.16 లక్షలు, కమ్యూటేషన్ రూ.5.73 లక్షలు, సంపాదిత సెలవుల కింద రూ.12.02 లక్షలు, జీపీఎఫ్ రూ.4.9 లక్షలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో న్యాయం కోసం కోర్టుకెళ్లారు. దీంతో 8 వారాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన భాస్కర్, మంచిర్యాల జిల్లాకు చెందిన ఆగాచారి, మెదక్ జిల్లాకు చెందిన గంగయ్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అన్నపూర్ణమ్మతోపాటు పలువురు విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు జీపీఎఫ్, జీఎల్ఐ, శాలరీ ఏరియర్స్తోపాటు రిటైర్మెంట్ ఫైనల్ బెనిఫిట్స్ అందకపోవడంతో హైకోర్టు ను ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు 6 వారాల్లోగా విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ వడ్డీతో అందజేయాలని తీర్పునిచ్చింది.
వచ్చేదెన్నడో.. తిప్పలు తప్పేదెన్నడో..
గరిష్ఠంగా కోటి
పదవీ విరమణ పొందిన వారికి జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్, గ్రూపు ఇన్స్యూరెన్స్, జీఎల్ఐ, సంపాదిత సెలవులు, పెన్షన్ కమ్యూటేషన్ ప్రయోనాలు అందాలి. ప్రస్తుతం పెన్షన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 8000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విమరణ పొందుతారు. రిటైర్డ్ అయిన వారికి కనిష్ఠంగా రూ.35 లక్షలు, గరిష్ఠంగా రూ.75 లక్షలు ప్ర యోజనాలుగా అందాల్సి ఉన్నది. గెజిటెడ్ క్యాడర్లో రిటైర్ అయ్యేవారికి కోటి రూపాయల వరకు చెల్లించాలి. గతంలో ఉదయం బిల్లులు సమర్పిస్తే సాయంత్రం కల్లా అకౌం ట్లో డబ్బులు పడేవి. కానీ ఇప్పుడు ఏడాది గడిచినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడంలేదు. మొత్తం 4000 కోట్ల వరకు ఉం టుందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.