మహబూబ్నగర్ : జీవితంలో స్థిరపడాలంటే కష్టపడి చదవాలని, అందుకు స్థిరమైన లక్ష్యం, గొప్ప వ్యక్తిని కావాలని ఆలోచన ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుటుంబంలో ఒక ఆడబిడ్డ బాగుపడితే ఆ కుటుంబం అంతా బాగుపడుతుందని, తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడాలని కోరారు.
మహబూబ్ నగర్ స్టేడియం గ్రౌండ్స్ సమీపంలో రూ. 1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన కళాశాల వసతి గృహాన్ని ప్రారంభించి మాట్లాడారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించాలనే ఆలోచన చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ఎంతో వెనుకబాటు గురైన తండాలను సమైక్య ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
నాటు వైద్యంతో కష్టాలు పడ్డారని, తాగునీటికి ఇబ్బంది పడేవారని, సరైన వసతులు లేక గిరిజన విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష అయ్యేదని, మౌలిక వసతులు ఏమాత్రం అందే పరిస్థితి ఉండేది కాదన్నారు.
తండాలను తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చడమే కాకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి కష్టాలను తీర్చమన్నారు. తండాల్లో బాల్య వివాహాలు ఆపేందుకు కల్యాణ లక్ష్మి లాంటి పథకం ఎంతో ఉపయోగంగా మారిందన్నారు.
రూ.1.10 కోట్ల వ్యయంతో గిరిజన భవన్ నిర్మిస్తున్నామని, అక్కడికి సమీపంలోనే సేవాలాల్ మహారాజ్ గుడిని కూడా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎదిరలో రూ. 4.20 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తున్నామని, అక్కడికి సమీపంలోనే రూ. 2.70 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా నిర్మించామని మంత్రి తెలిపారు.
గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేస్తున్నామనని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.