Pharma City | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ ఉన్నదో లేదో చెప్పాలని, దీనిపై 6 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫార్మా సిటీ రద్దయినట్టు పత్రికల్లో వచ్చిన కథనం ఆధారంగా తాము నిర్ణయానికి రాలేమని తేల్చిచెప్పింది. ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం సేకరించిన భూముల పరిహార అవా ర్డు చెల్లదని గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చినందున తమ భూములపై ఉన్న ఆంక్షలను రద్దు చేయాలని కోరుతూ మేడిపల్లికి చెందిన 49 మంది దాఖ లు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం విచారణ జరిపారు.
ఫార్మా సిటీ భూసేకరణ కోసం 2017లో జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండానే పరిహార అవార్డు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ నిరుడు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది చెప్పారు. ప్రభుత్వం ఫార్మా సిటీని రద్దు చేసినట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని, దీంతో రైతుల భూములపై ఆంక్షలను ఎత్తివేసి, మ్యుటేషన్లకు వీలుకల్పించాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది దివ్య ప్రతివాదన చేస్తూ.. పి టిషనర్లు వాస్తవాలు చెప్పలేదని, పత్రిక ల్లో వచ్చిన కథనాల ఆధారంగా అసత్యాలతో కోర్టుకు వచ్చారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. అసలు ఇంత కీ ఫార్మా సిటీ ఉన్నదో? లేక రద్దయిందో చెప్పాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. అప్పటి వరకు ఈ పిటిషన్‌లోని అంశాల జోలికి వెళ్లబోమని స్పష్టం చే స్తూ.. విచారణను 6కు వాయిదా వేశారు.