కొత్తపల్లి, ఏప్రిల్ 4 : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే నిరసనలు, ఆందోళనలు తప్పవని టీఎన్జీవో నాయకులు ప్రజా ప్రతినిధులకు అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో శుక్రవారం ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా జేఏసీ నాయకులు స్థానిక జడ్పీ కార్యాలయంలోని సుడా ఆఫీసులో చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ప్రజలను, ప్రజా ప్రతినిధులను కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకునేది ప్రభుత్వ ఉద్యోగులేనన్నారు. ఉద్యోగులకు జీత భత్యాలు, పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు, పీఆర్సీ, హెల్త్ కార్డులు, జీతాలను ఈ-కుభేర్ ద్వారా కాకుండా జిల్లా ట్రెజరీల ద్వారా ఇప్పించాలని కోరారు.