హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గురువారం ఉదయం విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని హైదరాబాద్కు మళ్లించారు. ఘటన జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టు తెలిసింది. తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లయిట్ తిరిగి హైదరాబాద్కు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యా రు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్న ట్టు స్పైస్ జెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది.
ఢిల్లీ నుంచి లెహ్కు వెళ్తున్న ఇండిగో విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం తిరిగి ఢిల్లీకి చేరుకున్నది. ఇండిగో ఫ్లైట్ 6ఈ 2006 విమానంలో ఈ సమస్య తలెత్తిందని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఇండిగో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇంధన కొరత కారణంగా గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. రాత్రి 7.45 గంటలకు ఈ విమానం చెన్నైకి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంధనం తక్కువగా ఉండటంతో చెన్నై గగనతంలోకి వచ్చిన తర్వాత విమానాన్ని బెంగళూరు ఎయిర్పోర్టుకు మళ్లించారు.