హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ.
ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను మూసివేసి, గ్రహణ ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాత సాయంత్రం 7:30 గంటలకు తెరుస్తారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తారు. రాత్రి 8:30 నుంచి భక్తులను సర్వదర్శనం కోసం అనుమతిస్తారు.