Congress MLA | హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. ‘ ఏపీ నేతలు మా దగ్గరికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మేము ఒక్కమాట అనలేదు. మీరు తెలంగాణకు రావొద్దని, అసెంబ్లీలో బాయ్‌కాట్ అనే నిర్ణయం తీసుకుంటే మీరే బాధపడతారు.’ అంటూ హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నాం.. మీరు విభజన సమయంలో ఒక కన్ను తెలంగాణ .. ఒక కన్ను ఆంధ్రా అని చెప్పారు. మరి ఈ రోజు ఒక కన్ను (తెలంగాణ)ను తీసేశారా? మీ ఎమ్మెల్యేలు, నేతలు యాదాద్రి, భద్రాచలం వచ్చి ఈవోలకు ఫోన్లు చేస్తే గౌరవమర్యాదలిస్తున్నారు. ఇక్కడ మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.’ అని మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు దర్శనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈవో శ్యామలరావు ఏపీ సిఫారసు లేఖలు మాత్రమే అనుమతిస్తామని చెప్పారన్నారు.
నిరుడు ఇచ్చిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే సరఫరా చేస్తామనడం సమంజసం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలా చేప పిల్లలను తగ్గించి సరఫరా చేస్తే.. చేపలతో ఉపాధి పొందే ముదిరాజ్ సామాజిక వర్గానికి నష్టం కలుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. నిరుడు చెరువులకు సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఈ ఏడాది సరఫరా చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా.. నిరుడు కంటే ఈ ఏడాది సగం సరఫరా చేయాలని రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ ఆంక్షలు విధించారని చెప్పారన్నారు. దీంతో నిరుడు లక్ష చేప పిల్లలు సరఫరా చేసిన చెరువులకు ఈ ఏడాది 50 వేలు మాత్రమే సరఫరా కానున్నాయని తెలిపారు. తన నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. వర్షాలు బాగా కురుస్తున్నా.. వానలు రావడం లేదని సాకుగా చూపించి ఫిషరీస్ డైరెక్టర్ చేపపిల్లల సంఖ్యను తగ్గించడం సమంజసం కాదని లేఖలో వివరించారు. ఫలితంగా ఈసారి చేపల సంఖ్య సగానికి తగ్గి.. వాటిపై ఆధారపడిన కుటుంబాల ఆదాయానికి గండిపడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే సీఎం చొరవ తీసుకొని నిరుడు ఇచ్చిన విధంగానే ఈసారి కూడా చేపపిల్లలు సరఫరా చేయాలని లేఖలో కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు.