హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, సంవత్సరాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో రద్దీ పెరిగింది. దీంతో వైకుంఠం కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని 9 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతున్నట్టు అధికారులు తెలిపారు. భక్తుల తాకిడితో తిరుమలలో ఎక్కడ చూసినా జనసందోహమే కనిపిస్తున్నది. వైకుంఠద్వార దర్శనం కూడా ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ రద్దీ 10రోజులపాటు కొనసాగే అవకాశమున్నట్టు టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు.