హైదరాబాద్ : కాంగ్రెస్(Congress party) సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి(Jeevan Reddy) ఆ పార్టీకి రాజీనామా చేయడం ఖాయమైపోయినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ ప్రయాణానికి పులిస్టాప్ పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈనెల 25న రాజీనామా చేయనున్నారు. 27వ తేదీ నుండి గ్రామాల బాట కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరించి, పార్టీ మార్పుపై ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. కాగా, మంత్రులు చెప్పినా, హైకమాండ్ వద్దన్నా జీవన్ రెడ్డి రాజీనామాకే సిద్ధపడ్డారు. నిన్న రాష్ట్ర మంత్రులు జీవన్ రెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ, ఆయన తన మనసులోని మాటను వారికి స్పష్టంగా తెలియజేశారు.
సారీ.. శ్రీధర్. ఆత్మాభిమానం చంపుకొని, గౌరవాన్ని వదులుకొని కాంగ్రెస్‌లో కొనసాగలేను.
మీకో దండం. మీ పార్టీకో దండం. ఇంతదూరం వచ్చి నన్ను కలిసినందుకు ధన్యవాదాలు. పార్టీలో కొనసాగడం మాత్రం ఇక జరిగే పనికాదంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి మంత్రులకు స్పష్టంచేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం శనివారం జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి వచ్చి గంటకుపైగా ఆ యనతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, 20 నెలల క్రితం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోవడం, పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు అధిష్ఠానం, సీఎం రేవంత్ మద్దతు పలుకడం తో జీవన్‌రెడ్డి మానసిక వేదనకు గురవుతూ వస్తున్నారు.