Ponnam Prabhakar | రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా అధికారులు పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయడానికి ఇటీవల రవాణా శాఖలో 33 జిల్లా స్థాయి బృందాలు, మూడు రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసింది. ఇందులో డీటీసీ, ఆర్టీఏ ఇతర అధికారులు నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. ఏ బృందం ఎక్కడ తనిఖీలు చేపడుతుంది అనే దానిపై ముందస్తు సమాచారం లేకుండా ప్రతి రోజు ఉదయం 6 గంటలకి ఆయా బృందాలకు సమాచారం అందించి తనిఖీలు చేపట్టింది. గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,748 కేసులు నమోదు చేశారు. మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్బృందాలు మరింత తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు ఓవర్ లోడ్ వల్లే అధికంగా జరుగుతుండడంతో దాని మీద అధికారులు ఎక్కువగా దృష్టి సారించారు. ఓవర్ లోడ్ అయిన వాహనాలు సీజ్ చేయడంతో పాటు, రెండోసారి ఓవర్ లోడ్ తో వాహనం పట్టుబడితే ఆ వాహనం పర్మిట్ రద్దు చేయడంతో పాటు, వాహనం నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకోనున్నారు . అయితే ఓవర్ లోడ్ పై మైనింగ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే వాహనాల లోడింగ్ జరుగుతుందో అక్కడే నివారించేలా చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.
హెవీ వెహికల్ డ్రైవర్‌కు లైసెన్సు రెన్యువల్ సమయంలో పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేసేలా కార్యాచరణ తీసుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రజల నుంచి సమాచారం వస్తే రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు.
గత సంవత్సరం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సారి జనవరిలో జరిగే రోడ్డు భద్రత మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా ఇప్పటి నుండి అవగాహన కల్పించాలని తెలిపారు. పాఠశాల నుంచి కాలేజీ వరకు వ్యాసరచన పోటీలు, రోడ్డు నిబంధన పై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చేసి ప్రమాదాలు తగ్గించి మరణాల రేటు నివారించేలా కార్యాచరణ తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో పెండింగ్ లో ఉన్న ఖాళీల భర్తీ చేయడంతో పాటు , ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పది రోజులకు ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు.