నిర్మల్: నిర్మల్ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. పదకొండు రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. తాజాగా నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్లో జాతీయ రహదారిపై వాహనదారుల కంటపడింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిర్మల్-ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా దర్జాగా రోడ్డు దాటుకుంటూ వెళ్లింది. దీంతో వాహనదారులు హడలెత్తిపోయారు. కార్లు, లారీల్లో ప్రయాణిస్తున్న డ్రైవర్లు తమ సెల్ ఫోన్లలో ఈ దృష్యాలను బంధించారు.
కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలో సంచరిస్తున్న ఈ పెద్దపులి.. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్ వైపు దారిమళ్లినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇస్నాపూర్, గౌలిగూడ, చింతగూడ, లింగట్ల, ఆరేపల్లి, వాంకిడి గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరడిగొండ అటవీ సిబ్బంది పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ట్రాప్ కెమెరాలతో నిఘా పెంచారు.
కాగా, వలస వచ్చిన పులిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు చెమటోడుస్తున్నారు. ఈ బెబ్బులి వయస్సు ఆరేండ్లకు పైగానే ఉంటుందని.. మహారాష్ర్టలోని పెన్‌గంగ టైగర్‌జోన్‌లో సంచరించే జానీ టైగర్‌గా గుర్తించినట్టు భైంసా ఎఫ్ఆర్వో వేణుగోపాల్ తెలిపారు. పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపడుతున్నట్టు ఎఫ్ఆర్వో పేర్కొన్నారు.